బీజేపీ, కాంగ్రెస్ ఉత్త మాటలతో అధికారంలోకి రావాలని చూస్తున్నాయి

ఆచరణకు నోచుకోని ఉత్తమాటలు చెప్పి అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గుంటనక్కల్లా చూస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Update: 2024-05-09 10:44 GMT

దిశ, అల్వాల్ : ఆచరణకు నోచుకోని ఉత్తమాటలు చెప్పి అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గుంటనక్కల్లా చూస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని అల్వాల్ సర్కిల్ వీబీఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఎవ్వరు కూడా స్థానికులు కారనీ, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఒక్కడే స్థానికుడన్నారు. పది సంవత్సరాల మోదీ పాలనలో ప్రజలకు జరిగిన మేలేమిటో ఆ పార్టీ నాయకులు తెలపాలని కోరారు. మోదీ పాలనలో ధరలు పెరగడం తప్ప ఏమీ లేదన్నారు.

    మోదీ అధికారం చేపట్టిన 2014లో రూ.74 ఉన్న పెట్రోల్ రేటు ఈ రోజు వందకు పైగా పెరిగిందన్నారు. మోదీ అధికారం చేపట్టినప్పటికి ఇప్పటికి పెట్రోల్ బ్యారల్ పై 16 డాలర్లు తగ్గిందన్నారు. అయినా రేటు దించడంలేదన్నారు. 34 శాతం వివిధ పన్నుల రూపేన వసూలు చేయడం మూలంగా రేటు పెరుగుతుంది తప్పితే తగ్గడం లేదన్నారు. ఇది ఏంది అని మోదీని అడిగితే మేము జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం, అందుకు రేట్లు దించడం సాధ్యం కాదన్నారు. అందులో ఏమాత్రం నిజంలేదన్నారు. రోడ్ల నిర్మాణానికి టోల్ గేట్ల వద్ద వాహనదారుల ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయం నిజం కాకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కాలేశ్వరానికి జాతీయ హోద లేదని, సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు లేవని, హైదరాబాద్ కు వరదలు వస్తే పైసా సహాయం చేసింది లేదు అన్నారు. అదే గుజరాత్ కు ఎంత సహాయం అంటే అంత అందచేస్తూ

    పక్షపాత వైఖరితో పాలన చేస్తున్నాడని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని, ఇది మనకు అవసరమా అన్నారు. ఉత్త మాటలు చెప్పి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్న రెండు పార్టీను బండకేసి కొట్టి బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకు ముందు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, రావుల అంజయ్య తదితరులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేసిన మోసాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నందికంటి శ్రీధర్, కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిశోర్ గౌడ్, ఢిల్లీ పరమేష్, రాపర్తి చంద్రశేఖర్, మల్లేష్ గౌడ్, మందశోభన్ బాబు, వెంకటాపురం, అల్వాల్, మచ్చబొల్లారం, కౌకూర్, మల్కాజిగిరి తదితర ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

Similar News