అక్రమ నిర్మాణంలో అడ్మిషన్స్​ ఓపెన్​..

జీహెచ్​ఎంసీ, విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఓ ప్రైవేటు

Update: 2024-05-22 15:49 GMT

దిశ,కూకట్​పల్లి: జీహెచ్​ఎంసీ, విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా నిర్మించిన ఐదంస్తుల అక్రమ నిర్మాణంలో విద్యాశాఖ నిబంధనలను సైతం తుంగలో తొక్కి పాఠశాల నిర్వహిస్తుండటం అటు జీహెచ్ఎంసీ, ఇటు విద్యా శాఖ అధికారుల పనితనాన్ని ప్రశ్నిస్తుంది. మూసాపేట్​ సర్కిల్​ పరిధి భరత్​నగర్​లో వివేకానంద కాన్వెంట్​ హై స్కూల్​ యాజమాన్యం ప్రభుత్వ, జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జీ ప్లస్​ 5 అక్రమ నిర్మాణంలో పాఠశాలను నిర్వహిస్తున్నారు. 12 అడుగుల రోడ్డులో ఎటువంటి సెట్​బ్యాక్​లు లేకుండా నిర్మించిన నిర్మాణం కావడంతో విద్యార్థులు ఇరుకైన టువంటి వాతావరణంలో విద్యాభ్యాసం చేయాల్సిన పరిస్థితి ఉంది.

అగ్ని ప్రమాదం సంభవిస్తే విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటి ఎవరు..?

పాఠశాల నిర్వహించే సమయంలో యాజమాన్యం విశాలమైన ప్రాంగణం, క్రీడా మైదానం, మంచి వెలుతురు వచ్చేలా నిర్మించిన తరగతి గదులలో తరగతులు నిర్వహించాలి. పాఠశాలలో తప్పని సరిగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో మంటలను అదుపు చేసే విధంగా పైప్​లైన్​ ఏర్పాటు చేయాలి, పాఠశాల భవనం చుట్టూ ఫైర్​ ఇంజన్​ తిరిగే విధంగా సెట్​ బ్యాక్​లు ఉండాలి. వీటిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వివేకానంద కాన్వెంట్​ హై స్కూల్​ యాజమాన్యం అక్రమ నిర్మాణంలో తరగతులు నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సందర్భంగా విద్యార్థులు కనీసం బయట వచ్చే పరిస్థితి లేకుండా నిర్మాణం చేపట్టారు. విద్యార్థుల జీవితాలకు గ్యారంటి ఇచ్చేది ఎవరు...? నిబంధనలు పాటించకుండా పాఠశాల నిర్వహిస్తున్న యాజమాన్యమా.. లేదా నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేపడుతున్న కండ్లు మూసుకున్న జీహెచ్​ఎంసీ అధికారులదా...? ఎటువంటి నిబంధనలు పాటించకున్న అనుమతులు మంజూరు చేసి చేతులు దులుపుకున్న విద్యాశాఖ అధికారులా..? విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం చెప్పేది ఎవరు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.

స్పందించని విద్యాశాఖ అధికారులు..

నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వివేకానంద కాన్వెంట్​ హై స్కూల్​ విషయంలో వివరణ అడిగేందుకు దిశ ప్రతినిధి జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి, మండల విద్యాశాఖ అధికారి వసంత కుమారిలను సంప్రదించేందుకు ప్రయత్నించగా అధికారులు స్పందించకపోవడం గమనార్హం.

చర్యలు తీసుకుంటాం: మల్లేశ్వర్​, ఏసీపి, మూసాపేట్​ సర్కిల్​

నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన పాఠశాలకు సంబంధించిన భవనంపై విచారణ చేపట్టి జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారు ఎవరైన సరే కఠిన చర్యలు తప్పవు.

Similar News