ప్రజా ప్రతినిధుల,పోలీసుల నిర్లక్ష్యానికి బీటెక్ విద్యార్థి బలి

దిశ’ చెప్పిందే నిజమైంది. ప్రజా ప్రతినిధులు, పోలీసుల నిర్లక్ష్యానికి

Update: 2024-05-07 12:42 GMT

దిశ, ఘట్కేసర్ : ‘దిశ’ చెప్పిందే నిజమైంది. ప్రజా ప్రతినిధులు, పోలీసుల నిర్లక్ష్యానికి ఓ బీటెక్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. గత నెల 25న "ప్రమాదకరంగా క్వారీ గుంతలు" అనే శీర్షిక తో 'దిశ' వెబ్ న్యూస్ లో కథనం ప్రచురితమైంది. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ గ్రామంలోని క్వారీ గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయని, ఆ గుంతల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని, ఆ గుంతలలో యువకులు ఈత కొట్టకుండా పోలీసు గస్తీ ఏర్పాటు చేయాలని వార్త కథనం ద్వారా అప్రమత్తం చేసినప్పటికీ ప్రజాప్రతినిధులు, పోలీసులు పట్టించుకోలేదు. ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామ పరిధిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ మొదటి సంవత్సరం బీటెక్ విద్యార్థి యశ్వంత్, తోటి విద్యార్థులతో మంగళవారం సాయంత్రం అన్నోజిగూడలోని క్వారీ గుంతలో ఈత కొట్టడానికి వచ్చి గల్లంతయ్యాడు.

నీట మునిగిన యశ్వంత్ ను కాపాడడం కోసం తోటి స్నేహితులు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం రాలేదు. దీంతో పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు సమాచారం అందించారు. పోచారం పిఎస్ ఎస్ఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నీట మునిగిన యశ్వంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నీట మునిగి దాదాపు రెండు గంటలకు పైగా కావడంతో యశ్వంత్ మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. యశ్వంత్ తో పాటు ఉన్న విద్యార్థులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. యశ్వంత్ స్వగ్రామం ఏలూరు, ఆంధ్రప్రదేశ్ అని స్నేహితులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News