మాటపై నిలబడతాం... ప్రజలకు సంక్షేమ పాలనను అందిస్తాం

మాటపై నిలబడతాం... ప్రజలకు సంక్షేమ పాలనను అందిస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

Update: 2024-04-28 15:52 GMT

దిశ, గుమ్మడిదల : మాటపై నిలబడతాం... ప్రజలకు సంక్షేమ పాలనను అందిస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ.. మండల పార్టీ అధ్యక్షులు పుట్టా నర్సింగరావు ఆధ్వర్యంలో గుమ్మడిదల మండల పరిధిలోని అన్నారం గ్రామం నుండి గుమ్మడిదల టోల్ ప్లాజా వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ ను ఏర్పాటు చేసి మాట్లాడారు.

నీలం మధును గెలిపించాలి : నిర్మల జగ్గారెడ్డి

మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి అన్నారు. గుమ్మడిదల కార్నర్ మీటింగ్ లో ఆమె మాట్లాడారు. గత తొమ్మిది ఏళ్లు బానిస బతుకులు బతికామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ ధైర్యంగా బతికే రోజులు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో పేదలందరికీ న్యాయం జరిగేలా ఐదు గ్యారెంటీలను అమలు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల్లోనే లక్ష ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ గొప్ప అవకాశం ఇచ్చింది : కాటా శ్రీనివాస్ గౌడ్..

మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే గొప్ప అవకాశం నీలం మధుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని పటాన్​చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ అన్నారు. గుమ్మడిదల కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఐదు గ్యారెంటీలు అమలవుతున్నాయన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి, పేదలకు అండగా నిలువనుందని తెలిపారు. పేదింటి నుంచి వచ్చిన నీలం మధును ఎన్నికలలో గెలిపించి, పార్లమెంటుకు పంపించాలని విజ్ఞప్తి చేశారు.

మాటపై నిలబడే పార్టీ కాంగ్రెస్ : ఎంపీ అభ్యర్థి నీలం మధు

మాటపై నిలబడే పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ అని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. గుమ్మడిదల కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ఈ దేశంలో రైతాంగాన్ని ఆదుకున్నది కూడా కాంగ్రెస్ యేనని గుర్తు చేశారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు భూములు, ఇండ్లు ఇచ్చిన ఘన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికలలో తనను గెలిపిస్తే మెదక్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు భారీ ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 

Similar News