సీఎం సొంత ఇలాకాలో గేదేల పంపిణీలో అవినీతి
ఆ ఊరు పేరు చెబితే ఆదర్శం ఉట్టి పడుతుంది. రాష్ట్రంలోని గ్రామాలు ఆ పల్లెబాటలో నడవాలని అందరూ భావిస్తారు.
దిశ, మెదక్ ప్రతినిధి: ఆ ఊరు పేరు చెబితే ఆదర్శం ఉట్టి పడుతుంది. రాష్ట్రంలోని గ్రామాలు ఆ పల్లెబాటలో నడవాలని అందరూ భావిస్తారు. అందుకే ఆ విలేజ్ ఆదర్శానికి కేరాఫ్ గా ముచ్చట పడిన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఊరికి ప్రత్యేక ఉపాధి కల్పించేందుకు గేదెలు పంపిణీ చేశారు. కానీ ఆదర్శ గ్రామానికి ఇచ్చిన గేదెలు అంగట్లోకి చేరాయి.. పర్యవేక్షించాల్సిన అధికారులు చేతులెత్తేశారు.. రూ.కోట్లు వెచ్చించిన ఈ పథకం ప్రయోజనం లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ గ్రామమే మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామం.. అందులోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్య వహిస్తున్న నియోజకవర్గం.. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో కంటి వెలుగు పథకం ప్రారంభం కోసం వచ్చిన సందర్భంలో గ్రామంలో ఉపాధి కల్పనతోపాటు పాడి అభివృద్ధి కోసం గేదెలు ఇవ్వాలని కోరారు. ఆదర్శ గ్రామస్తులు అడిగిన వెంటనే సీఎం గేదెలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. అమలు కూడా చేశారు. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఉపాధిబాట అటుంచి, బర్రెలు మాత్రం అంగట్లోకి చేరాయని పలువురు చర్చించుకుంటున్నారు.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామం.. అందులోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్య వహిస్తున్న నియోజకవర్గం.. ఇక్కడ గ్రామ పంచాయతీ లో చేపట్టే కార్యక్రమాలు అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది.. చెత్త సేకరణ, పారిశుధ్యం పై చేస్తున్న కార్యక్రమాలు ఇతర పంచాయతీలకు దిశా నిర్ధేశం చేసేలా మాల్కాపూర్ కు పేరొచ్చింది... స్వచ్ఛ భారత్ కొనసాగిన తీరు, వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేసిన గ్రామం మల్కాపూర్. రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డు సైతం పొందింది. ఇక్కడ జరుగుతున్న స్వచ్ఛ భారత్ పై ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు సైతం ఆదర్శ గ్రామంలో పర్యటించి వారు చేపట్టే పనుల్ని పరిశీలించి ఆ రాష్ట్రాల్లో అమలు చేసే విధానం ఇక్కడ పారిశుధ్య, ఇతర కార్యక్రమాలను పాటిస్తున్నారు.. ఇంత ఆదర్శంగా ఉన్న గ్రామంలో ఏ పథకం ప్రవేశ పెట్టినా పక్కాగా అమలు జరుగుతుందన్న నమ్మకం అందరిలో ఉంటుంది. ఇందులో భాగంగా మల్కాపూర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో కంటి వెలుగు పథకం ప్రారంభం కోసం వచ్చిన సందర్భంలో గ్రామంలో ఉపాధి కల్పనతోపాటు పాడి అభివృద్ధి కోసం గేదెలు ఇవ్వాలని కోరారు.
ఆదర్శ గ్రామస్తులు అడిగిన వెంటనే సీఎం గేదెలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. గ్రామంలో పాడి ఉత్పత్తి పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో తక్షణమే గ్రామాల్లో ఇంటికి రెండు గేదెలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామంలో 341 కుటుంబాలు ఉండగా మొదటి విడతలో ఒక్కో యూనిట్ కు దాదాపు రూ.80 వేలు మంజూరు చేసి వారికి గేదెలను కొనుగోలు చేసి ఇచ్చారు. మొదటి విడత 2018 లో ఒక్కో యూనిట్ పంపిణీ చేశారు. వాటి నిర్వహణను బట్టి రెండో విడత ఇచ్చేలా నిర్ణయించారు. రెండో విడత ఆలస్యం కావడం మల్కాపుర్ కు 2023 జనవరిలో మంత్రి హరీష్ రావు వచ్చినప్పుడు గేదెల రెండో యూనిట్ ఇప్పించాలని లబ్ధిదారులు కోరారు. ఇందుకు తక్షణమే స్పందించిన మంత్రి వెంటనే గేదెలు పంపిణీ చేయాలని ఆదేశించారు. రెండో విడతలో 342 యూనిట్ లు అందజేశారు. గ్రామంలో గేదెల పంపిణీకి దాదాపు రూ.5 కోట్లకు పైగా నిధులు ప్రభుత్వం ఖర్చు చేసింది..
గ్రామంలో గేదెలు ఉన్నాయా..?
ఆదర్శ గ్రామం అందులో సీఎం నియోజక వర్గం కావడం తో అడిగిన వెంటనే గ్రామంలో దాదాపు 680 కి పైగా గేదెలు పంపిణీ చేశారు. ఇందులో ఒక్కో యూనిట్ విలువ రూ. 73 వేలు కాగా గేదెల భీమా, రవాణా ఖర్చులు కలిపి రూ.80 వేలు ఒక్కో యూనిట్ ఖర్చు చేశారు. 340 కుటుంబాల్లో దాదాపు 680 గేదెలు ప్రస్తుతం ఆ గ్రామంలో ఉండాలి. కాని ప్రస్తుతం వాటి సంఖ్య రెండు వందల లోపే ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. మొదటి విడతలో ఇచ్చిన 340 గేదెలు ఉన్నాయా.. లేదా అనే పరిశీలన చేయకుండా అధికారులు మరో విడతలో ఎలా ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా సీఎం నియోజక వర్గం కావడం తో ఏదైనా పథకం అమలు పక్కాగా జరగాలి. అందులోనే ఆదర్శ గ్రామం కావడం వల్ల అందరి దృష్టి ఉంటుంది. గ్రామంలో గేదెల పథకం అమలు తీరు పై పరిశీలన కోసం వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి అధికారులు పర్యవేక్షణ ఎందుకు చేయలేదు.. మరి ప్రభుత్వం ఇచ్చిన గేదెలు ఏమైనట్లు... వందల గేదెలు ఎక్కడికి వెళ్లాయి అన్నది ప్రస్తుతం అందరిలో నెల కొన్న ప్రశ్న.. కానీ ప్రభుత్వం ఇచ్చిన గేదెలు 60 శాతం వరకు అంగట్లో విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇచ్చిన కొన్ని వెంటనే విక్రయాలు సాగినట్లు తెలిసింది.. దాదాపు 5 కోట్లకు పైగా నిధులతో గ్రామస్తుల ఉపాధి కోసం ఇచ్చిన గేదెలు అంగట్లో విక్రయిస్తే అధికారులు కనీసం విచారణ చేయకపోవడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులకు పర్శంటేజిలేనా.!?
గేదెల పంపిణీ లో అధికారుల పర్సెంటేజీ పర్వం సాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.80 వేల యూనిట్ కు రెండో వితతలో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు తీసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. దీనితో చాలా మంది గేదెలు కొనుగోలు చేయకుండానే పర్సంటేజీ ఇచ్చి మేనేజ్ చేయడం మూలంగానే గేదెలు గ్రామం వరకు రాలేదని తెలిసింది. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే.. గేదెల విక్రయాలపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. గ్రామంలో గేదెలు ఇచ్చి మూడు నెలలు గడిచిపోయింది.. ఇప్పుడు ఆ విషయం ఎందుకని వెటర్నరీ అధికారి వెంకటయ్య అన్నారు. కొన్ని ఉన్నాయని, మరి కొన్ని గేదెలు వారి బంధువుల వద్ద ఉంచారని ఆయన తెలిపారు.