ప్రజల సురక్షిత ప్రయాణం మా బాధ్యత : ఎస్పీ చెన్నూరి రూపేష్

ఆటోలో ప్రయాణించే మహిళల రక్షణకు పోలీస్ శాఖ మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు.

Update: 2024-05-27 11:50 GMT

దిశ, సంగారెడ్డి : ఆటోలో ప్రయాణించే మహిళల రక్షణకు పోలీస్ శాఖ మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ముందు ఆటో స్టిక్కరింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ… సంగారెడ్డి జిల్లాలో ప్రజల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా “MY AUTO IS SAFE” కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా సంగారెడ్డి, పటాన్ చెర్వు, నారాయణఖేడ్, జహీరాబాద్ సబ్ డివిజన్ లలో గల సుమారు 2000 ఆటో లకు (ఆటో ముందు, వెనక, డ్రైవర్ సీట్ వెనకాల ప్రయాణికులకు కనిపించే విధంగా) స్టిక్కరింగ్ చేయడం జరుగుతుందన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆటోకు కూడా ఈ స్టిక్కరింగ్ చేయడం జరుగుతుందని, ప్రయాణికులు ఎవరైనా ఆటోలో ప్రయాణించే ముందు మొదటగా ఆ ఆటోకు “మై ఆటో ఈజ్ సేఫ్” అనే స్టిక్కరింగ్ ఉందా అని గమనించాలన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆటో డ్రైవర్ మీతో అసభ్యంగా ప్రవర్తించిన, దురుసుగా మాట్లాడిన, మరేయితర సమస్యలు ఎదుర్కొన్న మీరు ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ సీట్ వెనకాల గల క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసిన వెంటనే ఆ ఆటో డ్రైవర్ కు సంబంధించిన పూర్తి సమాచారం మీ మొబైల్ లో కనిపిస్తుందన్నారు.

ఆ వివరాలను స్క్రీన్ షాట్ తీసుకొని, డిస్ప్లే పైన ‘కంప్లైంట్’, ‘కంప్లైంట్ టు షీ-టీం’, ‘ఎమర్జెన్సీ’, ‘రేట్ యువర్ ఆటో’ అను ఆప్షన్స్ కనిపిస్తాయని, మీకు తలెత్తిన సమస్య గురించి పైన కనిపిస్తున్న ఆప్షన్స్ ఎంచుకొని, మీ వివరాలను మీ సమస్యను, స్క్రీన్ షాట్ ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ ఫిర్యాదు నేరుగా సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న కంట్రోల్ రూంకు చేరుతుందన్నారు. కంట్రోల్ రూమ్ లో సిబ్బంది మీ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న వెంటనే సంబంధించిన ఆటో వివరాలను లోకల్ పోలీసులకు తెలియజేస్తారని, మీ సమస్యకు పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా మై ఆటో ఈజ్ సేఫ్ అనే స్టిక్కరింగ్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, ఆటో డ్రైవర్లకు అందించారు. ఎస్పీ స్వయంగా ఆటోలో కూర్చొని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసిన అనంతరం వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, పటాన్ చెర్వు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్, పటాన్ చెర్వు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రావణ్, సంగారెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ యన్. భాస్కర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News