భూ నిర్వాసితుల ఆశలు నెరవేరేనా?

ప్రాజెక్టుకు భూములు ఇస్తే అందరి బతుకులు మారుతాయని కన్నతల్లి లాంటి ఉన్న ఊరును విడిచి వెళ్ళిన నిర్వాసితుల జీవితాలు పరిహారాలు పూర్తిగా అందక అగమ్యగోచరంగా మిగిలిపోయాయి.

Update: 2024-05-26 07:02 GMT

దిశ, హుస్నాబాద్: ప్రాజెక్టుకు భూములు ఇస్తే అందరి బతుకులు మారుతాయని కన్నతల్లి లాంటి ఉన్న ఊరును విడిచి వెళ్ళిన నిర్వాసితుల జీవితాలు పరిహారాలు పూర్తిగా అందక అగమ్యగోచరంగా మిగిలిపోయాయి. ఎప్పుడు వస్తాయో తెలియని పరిహారం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తూ పడిగాపులు కాస్తున్నారు. భూములు కోల్పోయింది మొదలుకొని ఇప్పటివరకు సుమారు 15 సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిర్వాసితులకు ఒరగబెట్టిందేమీ లేదు. కోల్పోయిన భూముల పరిహారాల కోసం, పెండ్లి కాని యువతుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం చెప్పులు అరిగేలా తిరిగిన పరిహారాల మాట దేవుడెరుగు గాని నిర్వాసితులకు అందని ద్రాక్ష గానే మిగిలిపోయాయి.

గత ప్రభుత్వ వైఫల్యమే కారణమా?

భూ నిర్వాసితులకు పరిహారం అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని నిర్వాసితులు బాహాటంగానే చెప్తున్నారు. అర్ధరాత్రి నిర్వాసితులపై లాఠీచార్జి చేయించడం, బలవంతంగా ఇండ్లను ఖాళీ చేయించి బయటికి పంపించడం బి ఆర్ ఎస్ ప్రభుత్వ చేతగాని తనమేనని అందువల్లే నిర్వాసితుల బతుకులు నిర్వీర్యం చేసి చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యేలా చేశారన్నది నగ్న సత్యమని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు తర్వాత మొదలుపెట్టిన కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులు పూర్తి కాగా ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం శోచనీయం.

పర్యావరణ అనుమతులు నిల్

గౌరవెల్లి ప్రాజెక్టుకు ఇప్పటివరకు పర్యావరణ అనుమతులు లేకపోవడం శోచనీయం. బద్దం భాస్కర్ రెడ్డి మరియు కొంతమంది భూ నిర్వాసితులు కలిసి ఎన్జీటీ కోర్టును ఆశ్రయించగా పర్యావరణ అనుమతులు పొందే వరకు పనులు చేయరాదని ఎన్జీటీ ఆదేశించడంతో పనులు చేయకుండా కట్టపై కెమెరాలు బిగించి పర్యవేక్షించాలని ఆదేశించగా ప్రాజెక్టు యొక్క కట్టపై కెమెరాలు బిగించారు.

పునాది వేసి.... పూర్తి చేస్తారా?

2007వ సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టును 1.43 టీఎంసీల కు శంకుస్థాపన చేశారు. 2009 ప్రథమార్ధం వరకు ప్రధాన కాలువల నిర్మాణంతో పాటు 70 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి .కాగా అప్పటికే ప్రాజెక్టు కోసం సేకరించిన భూమి 1850 ఎకరాలకు గాను రెండు లక్షల పదివేల రూపాయలు అప్పటి ప్రభుత్వం చెల్లించింది. కానీ సమస్య అంతటితో ఆగిపోలేదు. 2014లో వచ్చిన బి.ఆర్.ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం గౌరవెల్లి ప్రాజెక్టు ను 8.23 టీఎంసీలకు పెంచడంతో అదనంగా 2000 ఎకరాల భూమి సేకరించవలసి ఉండగా 1950 ఎకరాలు సేకరించారు దీనికి గాను 2016 లో ఎకరానికి ఆరు లక్షల 95 వేల రూపాయలు చెల్లించగా 1700 ఎకరాలకు సంతకాలు చేసి పరిహారం తీసుకోగా మిగిలిన భూమికి 2021 లో 15 లక్షల రూపాయలు చెల్లించారు. ఇంకా మిగిలిన 50 ఎకరాల భూములు గల రైతులు చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరగా ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు. అలాగే ఆర్ & ఆర్ ప్యాకేజీ కింద పెళ్లి కానీ యువతులకు ప్యాకేజీ ఇవ్వకపోవడంతో పరిస్థితి మరింత జటిలమయ్యింది.

అప్పటికే భూ నిర్వాసితుల పరిహారం చెల్లించాకే ఖాళీ చేస్తామని భీష్మించుకు కూర్చుండడంతో అర్ధరాత్రి వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడం తో పరిస్థితి చేజారిపోయింది. ఇక అప్పటి నుండి నిర్వాసితులు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో తల దాచుకోవలసిన పరిస్థితి నెలకొంది. అయినా ధైర్యం కోల్పోకుండా మొక్కవోని దీక్షతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే మరోవైపు హైకోర్టు లో కేసులు వేసి తమ హక్కుల కోసం పోరాడారు. కానీ పోలీసుల చేత బలవంతంగా ఇళ్లలో నుంచి నిర్వాసితులను ఖాళీ చేయించి మే 10 , 2023లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా కూల్చివేసింది. దీంతో కొన్ని కుటుంబాలు హుస్నాబాద్ మండలంలోని పందిళ్ళలో , నందారం స్టేజి వద్ద, పట్టణంలోని పాల కేంద్రం వద్ద, పోతారం ఎస్ గ్రామ శివారులో, గౌరవెల్లి వద్ద ఇండ్లు నిర్మించుకున్నారు. అయితే కొందరు పరిహారం రానివారు ఎంతో కొంత పరిహారం వచ్చిన వారు పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు ఖర్చయి పోవడంతో ఇల్లు నిర్మించుకోవడానికి డబ్బులు లేక రేకులు వేసుకుని పరదాలతో గుడిసెలు వేసుకుని అందులోనే జీవిస్తున్నారు. ఇటు పరిహారం రాక అటు భూములు కొనక ఇల్లు నిర్మించుకోకపోవడం వలన దిక్కులేని పరిస్థితుల్లో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు.

2007లో కాంగ్రెస్ ప్రభుత్వం తో మొదలైన గౌరవెల్లి ప్రాజెక్టు ప్రక్రియ మళ్లీ 2023 నవంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా పొన్నం ప్రభాకర్ గెలవడం తదనంతరం మంత్రి కావడంతో తమకు న్యాయం చేస్తాడని నిర్వాసితులు ఎదురుచూస్తూ ప్రాజెక్టు పూర్తి నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. కాగా మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సందర్భాల్లో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం నా యొక్క ప్రధాన కర్తవ్యం అని, ముఖ్యమంత్రి దృష్టిలో ఈ సమస్యను పూర్తి చేయాలని ఉందని వెల్లడించడంతో నిర్వాసితుల్లో ఆశలు చిగురించాయి.

గౌరవెల్లి ప్రాజెక్టు విషయమై మంత్రి ముందున్న సవాళ్లు

50 ఎకరాలకు పరిహారం,

10 మందికి ఇంకా లిస్టులో తప్పిపోయిన కొంతమందికి ఆర్&ఆర్ ప్యాకేజీ,

1500 మందికి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఇంటి నిర్మాణం కొరకు పరిహారం,

నలుగురికి ఇండ్ల పరిహారం,

గౌరవెల్లి ప్రాజెక్టుకు భూములు ఇచ్చి సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను అవగతం చేసుకొని ఇప్పుడు గెలిచిన హుస్నాబాద్ ఎమ్మెల్యే మరియు మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ భూనిర్వాసితుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని సమస్యల పై సాధ్యమైనంత తొందరగా ముఖ్యమంత్రితో చర్చించి పరిహారాలు ఇప్పించి నిర్వాసితులను ఆదుకోవాలి. పలుమార్లు లాఠీ చార్జీలకు బలైనాము మాపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు ఇప్పటికీ ఇంకా బాధలు అనుభవిస్తూ కోర్టుల చుట్టు తిరుగుతూనే ఉన్నాం. నేరస్తుల్లాగా మా చేతులకు సంకెళ్లు వేసినా భరించాం. ఎందుకంటే ఏదో ఒక రోజు మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని. కాబట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ సాధ్యమైనంత తొందరగా మా సమస్యలకు స్పందిస్తారని ఆశిస్తున్నాం.:-భూ నిర్వాసితుడు బద్దం శంకర్ రెడ్డి

Similar News