ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ భద్రంగా ఉంది

ఇందిరాగాంధీ పాలించిన మెదక్ గడ్డపై తనను ఎంపీగా గెలిపిస్తే త్వరలోనే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అటు కేంద్ర నిధులు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్ర నిధులతో ఈ నియోజకవర్గంలోని అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించి, గ్రామాల అభివృద్ధికి పాటుపడతానని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు.

Update: 2024-05-07 12:34 GMT

దిశ, మనోహరాబాద్ : ఇందిరాగాంధీ పాలించిన మెదక్ గడ్డపై తనను ఎంపీగా గెలిపిస్తే త్వరలోనే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అటు కేంద్ర నిధులు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్ర నిధులతో ఈ నియోజకవర్గంలోని అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించి, గ్రామాల అభివృద్ధికి పాటుపడతానని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు భూమిరెడ్డి , ఎలక్షన్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా పార్టీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి, నాయకుడు చిటుకుల మైపాల్ రెడ్డి, ఉమ్మడి మండల సొసైటీ అధ్యక్షుడు మెట్టుపాల కృష్ణారెడ్డి, మాజీ రైతు సంఘం చైర్మన్ సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ విట్టల్ రెడ్డి లతో కలిసి మండలంలోని రంగాయిపల్లి, చెట్ల గౌరారం, దండుపల్లి, కాళ్లకల్ గ్రామాలలో రోడ్ షో నిర్వహించి తనకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు.

     ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ భద్రంగానే ఉందని, కల్లబొల్లి మాటలు చెప్పే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను నమ్మరాదని ప్రజలను కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, నిరుపేదలకు అందిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయని వారు తెలిపారు. సోనియాగాంధీ దయ వల్ల ఏర్పాటైన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం 10 సంవత్సరాలు దోచుకు తిన్నదని ఆరోపించారు. తెలంగాణ ముసుగులో కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ దందాలు చేసి కోట్లు గడించి జైలులో ఊసలు లెక్కబెడుతుందని తెలిపారు. ఫోన్ ట్యాపింగు కేసులు, కాలేశ్వరం, మల్లన్న సాగర్ అవినీతితో త్వరలోనే వారు కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్రలు చేస్తుందని వారన్నారు. బీజేపీకి ఓటు వేస్తే అణగారిన వర్గాల ప్రజలు అథోగతి పాలవుతారని తెలిపారు.

     సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ కుల గణన జరుగుతుందని, దీంతో బీసీలకు, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కాగానే తెలంగాణలో దొరల రాజ్యం పోయి ప్రజా పాలన నడుస్తుందని గుర్తు చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ప్రధాని రాహుల్ గాంధీ సహాయ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల కంటే మరిన్ని హామీలు అమలై అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు, గ్రామాల అభివృద్ధి శరవేగంగా జరుగుతాయని వారు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు రైతుబంధు సహాయం రైతుల ఖాతాలలో జమవుతున్నాయని తెలిపారు.

    ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ జరిగి తీరుతుందని అన్నారు. ముఖ్యంగా కాళ్లకల్ పారిశ్రామిక వాడలో కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం ఆసుపత్రి నిర్మిస్తామని, పరిశ్రమలు నష్టపోకుండా ఫైర్ స్టేషన్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముప్పిరెడ్డిపల్లి , కాళ్లకల్ గ్రామాలకు చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ పెంటయ్య, భిక్షపతి, పెద్దింటి చంద్రయ్యలతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి నీలం మధు ముదిరాజ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ప్రచారంలో నాయకులు లబ్ది పీర్ల శ్రీనివాస్ గౌడ్, నరసింహాచారి, నాగరాజు గౌడ్, రమేష్ చారి, శ్రీనివాస్, శ్రీహరి గౌడ్, నరేందర్​ రెడ్డి, లక్ష్మారెడ్డి, నరేష్ ముదిరాజ్, లక్ష్మీ నరసింహ గౌడ్ లతోపాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు చెట్ల గౌరవం నుండి కాలకల్ వరకు నాయకులు, కార్యకర్తలు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు.

Similar News