అమలుకాని హామీలకు కేరాఫ్... కాంగ్రెస్ పార్టీ

అమలుకు సాధ్యం కాని హామీలను ప్రకటించడంలో కాంగ్రెస్ పార్టీ చిరునామాగా మారిందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు.

Update: 2024-04-28 11:52 GMT

దిశ, పటాన్ చెరు : అమలుకు సాధ్యం కాని హామీలను ప్రకటించడంలో కాంగ్రెస్ పార్టీ చిరునామాగా మారిందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా శనివారం రాత్రి రామచంద్రపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన రామచంద్రపురం, భారతీ నగర్ డివిజన్ల మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమర్థుడు, పరిపాలన దక్షత కలిగిన రిటైర్డ్ ఐఏఎస్, ఉమ్మడి జిల్లా పై పూర్తి అవగాహన కలిగిన వెంకట్రామిరెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందని, ఇలాంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపిస్తే అభివృద్ధిని సుసాధ్యం చేస్తాడని తెలిపారు.

    పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతీకగా నిలపడంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక స్వావలంబన అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని తెలిపారు. ప్రజలను ఓటు హక్కు అడిగే నైతిక హక్కు కేవలం బిఆర్ఎస్ పార్టీకే దక్కిందని అన్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు వాటి అమలులో మీనమేషాలు లెక్కిస్తోందని తెలిపారు. ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. రాబోయే 12 రోజులపాటు రెండు డివిజన్ల పరిధిలోని కార్యకర్తలందరూ గడపగడపకు వెళ్లి గత పదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, పార్టీ సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్, భారతి నగర్ డివిజన్ అధ్యక్షులు పృథ్వీరాజ్, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

Similar News