అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేయాలి

జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి పనులు నిర్దేశిత గడువు తేదీలోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.

Update: 2024-05-24 12:28 GMT

దిశ, చేగుంట : జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి పనులు నిర్దేశిత గడువు తేదీలోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామం చేగుంట స్కూల్ అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మతులను క్షేత్రస్థాయిలో శుక్రవారం పరిశీలించారు. పాఠశాలలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, సుందరీకరణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.

    జిల్లాలో ఎంపికైన 562 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఇప్పటి వరకు అభివృద్ధి పనులు ప్రారంభమై 60 శాతం పనులు పూర్తయినట్టు తెలిపారు. ప్రత్యేక అధికారులు మండల స్థాయిలో పనుల పురోగతిపై సమీక్షించి త్వరితంగా పూర్తయ్యేలా నిత్యం పర్యవేక్షించాలని అన్నారు. ఆయా అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. అనంతరం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి త్వరితగతిన రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ, స్థానిక తహసీల్దార్ గియా ఉన్నిసా బేగం, ఇరిగేషన్ ఏఈ మమత, సర్వే రవీందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Similar News