గాలి వాన బీభత్సం.. కూలిన భారీ వృక్షాలు

ప్రకృతి బీభత్సానికి గద్వాల నియోజకవర్గం అతలాకుతలం

Update: 2024-05-26 12:43 GMT

దిశ, గద్వాల: ప్రకృతి బీభత్సానికి గద్వాల నియోజకవర్గం అతలాకుతలం అయింది. ఆదివారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా భారీ గాలి దుమారం తో కురిసిన వాన ప్రజలను ఇబ్బందుల్లో పడేసింది. జిల్లా కేంద్రంతో పాటు గద్వాల, ధరూర్, కేటి దొడ్డి మండలాలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గద్వాల అయిజ ప్రధాన రహదారి పరుమాల స్టేజ్ వద్ద ఈదురుగాలులకు చెట్లు నేల కూలి రోడ్డు మీద పడటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. అదే విధంగా గద్వాల జూరాల డ్యామ్ ప్రధాన రహదారి శెట్టి ఆత్మకూరు శివారులో ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల విద్యుత్‌ లైన్లపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దాంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ సిబ్బంది లైన్లపై పడ్డ చెట్లకొమ్మలను తొలగించి, విద్యుత్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు.

Similar News