నారాయణపేటలో నూతన మండలాల ఏర్పాటు ఎన్నడో..?

నారాయణపేట జిల్లా 11 మండలాలతో ఏర్పాటు

Update: 2024-05-26 15:37 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట జిల్లా 11 మండలాలతో ఏర్పాటు అయింది. జిల్లాలో కొత్తగా అప్పట్లో గుండుమల్,మరికల్, కొత్తపల్లి మండలాలను ఏర్పాటు చేశారు. వీటిలో గుండుమల్.... కొత్తపల్లి మండలాల్లో నూతన పోలీస్ స్టేషన్ ల నిర్మాణం ఇతర కార్యాలయాలు ఏర్పాటు పెద్దగా ఇప్పటికీ కాలేదు. తహసీల్దార్ కార్యాలయం సంబంధించి రెవెన్యూ సేవలు మాత్రమే అందుతున్నాయి. కేవలం ధన్వాడ మండలం లో మాత్రమే నూతన పోలీస్ స్టేషన్ తో పాటు తాసిీల్దార్ కార్యాలయం ఉంది. ఈ సమయంలోనే జిల్లాలో మరికొన్ని నూతన మండలాల ఏర్పాటు డిమాండ్ ఉద్యమం జోరుగానే కొనసాగింది. కానీ మరికొన్ని నూతన మండలాల ఏర్పాటు ప్రక్రియ జిల్లాలో జరగలేదు. దీంతో మండలాల ఏర్పాటు అనేది ఎన్నికల ఫ్రంట్ హామీనే అనేలా ఉండి పోయింది.

ఎమ్మెల్యే ఎన్నికల్లో జోరుగా హామీలు...

గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు నూతన మండలాల ఏర్పాటును తాము అధికారంలోకి వచ్చిన వెంబడే చేస్తామని జోరు హామీలు ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి నెలలు గడుస్తున్న నారాయణపేట నియోజకవర్గం లో నూతన మండలాల డిమాండ్ బాగా ఉన్న కోటకొండ, గార్లపాడు, కానుకుర్తి,నూతన మండలాలుగా నోచుకోలేదు.

జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావం రోజు ప్రకటన వచ్చేనా?

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే మొదటి రాష్ట్ర అవతరణ వేడుకలు అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేస్తుంది. ఈ సందర్భంలోనైనా నారాయణపేట నియోజకవర్గం లో మూడు నూతన మండలాలు ఏర్పాటు అవుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు మండలాల ఏర్పాటు పై ఏ మేరకు కార్యాచరణ కొనసాగిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Similar News