వే బ్రిడ్జి తూకాల్లో వ్యత్యాసాలు.. ఐదు క్వింటాళ్ల తేడా రావడంతో అవాక్కైన రైతు

వే బ్రిడ్జ్ తూకాల్లో వ్యత్యాసానికి వే బ్రిడ్జి టెక్నికల్ సమస్యనే

Update: 2024-05-22 14:21 GMT

దిశ, నారాయణపేట క్రైం : వే బ్రిడ్జ్ తూకాల్లో వ్యత్యాసానికి వే బ్రిడ్జి టెక్నికల్ సమస్యనే కారణమని చివరకు రుజువు అయిన సంఘటనతో చివరకు రైతుకు 5 క్వింటాళ్ల ధాన్యం విక్రయానికి లాభం చేకూరింది. రైతు తూకాల్లో వ్యత్యసంపై ప్రశ్నించకపోయి ఉంటే 5 క్వింటాళ్ల ధాన్యం డబ్బులు నష్టపోయేవాడు. ఈ ఘటన నారాయణపేట నడిబొడ్డున చోటుచేసుకుంది. వరి కొనుగోలు కేంద్రాన్ని పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కానీ నారాయణపేట మెప్మా కొనుగోలు కేంద్రంలో గోల్ మాల్ జరుగుతుందని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తూ సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేశారు. నారాయణపేట పట్టణంలో ఉన్న వే బ్రిడ్జిలు కాకుండా సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటకొండ వే బ్రిడ్జి వద్ద ధాన్యం తూకాలు చేయించి కొనుగోలు చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. వే బ్రిడ్జ్ నిర్వాహకులతో కేంద్ర నిర్వాహకులు కుమ్మక్కయ్యారని రైతు సంఘం నాయకులు వెంకోబా అనంత్ రెడ్డి లు ఆరోపించారు.

ఒక వే బ్రిడ్జి వద్ద ఒకలా... మరొక వే బ్రిడ్జి వద్ద మరొకలా...

పెద్ద ఎత్తున ధాన్యం అమ్మకానికి తీసుకోవచ్చే రైతులు వే బ్రిడ్జి వద్ద తూకం చేసుకొని కొనుగోలు కేంద్రాలకు వస్తే వే బ్రిడ్జి తూకాల్లో కూడా భారీగా హెచ్చుతగ్గులు వస్తున్నాయి. ఓ రైతు ఏపీ 29 టి ఏ 559 9 లారీలో మే 14వ తేదీన హుబ్బన్న పవాడీ వే బ్రిడ్జి వద్ద తూకం చేయగా 28755 కిలోల తూకం వచ్చింది. తిరిగి ఓ గంట సేపటికి రైతు అదే లారీని కోటకొండ లోని సిద్ధార్థ వే బ్రిడ్జి వద్ద తూకం చేయగా 28240 కిలోల తూకం వచ్చింది. లారీలోని ధాన్యాన్ని నారాయణపేట మెప్మా కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్తే అక్కడ సిబ్బంది 5 క్వింటాళ్ల తేడా చూపి రైతుకు రిసిప్ట్ ఇచ్చారు. దీంతో రైతు 5 క్వింటాళ్ల తేడా రావడం ఏమిటని వే బ్రిడ్జి నిర్వాహకులతో ధాన్యం కొనుగోలు సిబ్బంది రింగ్ అయ్యారా అంటూ లబో దిబో మన్నాడు. ఈ అంశంపై రైతు సంఘం నాయకులు స్పందిస్తూ నారాయణపేట మార్కెట్ యార్డ్ పరిసరాల్లో యార్డు కు సంబంధించిన వే బ్రిడ్జిను ప్రారంభించి రైతులకు మేలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా నారాయణపేట యార్డులో మెప్మా ఆధ్వర్యంలో 6000 క్వింటాళ్ల వరి కొనుగోలు లక్ష్యం ఉండగా ఇప్పటివరకు 3258 క్వింటాళ్ల వరి కొనుగోలు 78 మంది రైతుల నుంచి తీసుకున్నారు. కోటకొండ వే బ్రిడ్జి టెక్నికల్ గా సమస్య రావడంతోనే ధాన్యం తూకంలో తేడా వచ్చిందని ఒప్పుకొని డీఎస్ఓ విచారణకు రాగ రైతుకు 5 క్వింటాళ్ల ధాన్యం తేడా లేకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు ఎంతమంది రైతులు ఇలా ధాన్యం తూకాల్లో మోసపోయి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Similar News