సంచలనం రేపిన బీఆర్ఎస్ నేత హత్య

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డి (53) హత్య రాజకీయంగా సంచలనం రేపుతోంది.

Update: 2024-05-23 15:55 GMT

దిశ, చిన్నంబావి: కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డి (53) హత్య రాజకీయంగా సంచలనం రేపుతోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతగా ఉన్న శ్రీధర్ రెడ్డి చిన్నంబావి మండలంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకునిగా చలామణి అవుతూ వచ్చారు. అవివాహితుడు అయిన శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకునిగా చలామణి అవుతూ వచ్చారు. బుధవారం రాత్రి తన సొంత గ్రామం లక్ష్మీ పల్లికి సమీపంలో ఉన్న వ్యవసాయ పొలం కళ్ళం వద్ద నిద్రించారు. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీధర్ రెడ్డిని నరికి చంపారు. ఉదయం విషయం తెలియడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

జాకిలాలను రప్పించి పోలీసులు వివరాలను సేకరించే ప్రయత్నాలు చేశారు. కాగా మృతుని తండ్రి ఈ హత్య ముమ్మాటికి మంత్రి జూపల్లి, అతని ప్రధాన అనుచరుడు తన కుమారుడిని హత్య చేయించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచలనం గా మారిన ఈ సంఘటన తెలిసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీ ఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అభిలాష రావు తదితరులు లక్ష్మీ పల్లి గ్రామానికి తరలివచ్చి మృతిని కుటుంబానికి, పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని ఇచ్చారు.

ఈ సందర్భంగా వారు శ్రీధర్ రెడ్డి అంత్యక్రియలలో పాల్గొని ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ హత్య ముమ్మాటికీ రాజకీయ హత్య అని , ఇందుకు కారణమైన మంత్రి జూపల్లిని మంత్రివర్గం నుంచి ముఖ్యమంత్రి బర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేశారు. కాగా ఇది రాజకీయ హత్య కాదు. శ్రీధర్ రెడ్డి కి భూములకు సంబంధించిన వివాదాలు, వివాహేతర సంబంధాలు తదితర కారణాలవల్ల హత్యకు గురి కావచ్చు.

ఈ విషయము అందరికీ తెలిసిందే.. వ్యక్తిగతంగా జరిగిన ఈ హత్యను బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం ఎంత మాత్రం తగదు అని అంటున్నారు. కాగా మంత్రి జూపల్లి కృష్ణారావు నేను ఎలాంటి వాడినో నియోజకవర్గ ప్రజలకు తెలుసు. హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటన విడుదల చేశారు. నిజా నిజాలు తెలుసుకోకుండా బీ ఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని మంత్రి పేర్కొన్నారు.హత్యకు గల కారణాలు ఏవి అయిన ఈ సంఘటన ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది.

Similar News