విభేదాలు మాని పార్టీని గెలిపించాలి.. లోక్ సభ ఎన్నికలు పార్టీకి ప్రతిష్ఠాత్మకం: కేటీఆర్

నేతలంతా సమన్వయంతో పనిచేయాలని మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. మాజీ మంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్ లో నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నేతలతో సమావేశం నిర్వహించారు.

Update: 2024-05-01 16:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నేతలంతా సమన్వయంతో పనిచేయాలని మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. మాజీ మంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్ లో నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ నేతల మధ్య విభేదాలు ఓటమికి కారణమయ్యాయని, అందరూ కలిసి కట్టుగా లోక్ సభ ఎన్నికల్లో పనిచేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తనను సంప్రదించవచ్చని సూచించారు. లోక్ సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకం అని, బంధువులు ఇతర సెగ్మెంట్లలో ఉంటే పార్టీకి ఓట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ ముగిసేవరకు విశ్రమించవద్దని పిలుపు నిచ్చారు. పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుందన్నారు. నాంపల్లి సెగ్మెంట్ గ్రూపులతో సతమతం అవుతుండటంతోనే పార్టీని కాపాడుకోవడం కోసం రెండో సమావేశం నిర్వహించినట్లు సమాచారం.

పద్మారావు గౌడ్, మాజీ మంత్రి తలసానితో భేటీ

నందినగర్‌లో ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌తో పాటు గ్రేటర్ లో పార్టీ నేతల వివరాలను ఆరా తీసినట్లు సమాచారం. పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ, అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఇప్పటివరకు మార్పు, నేతలు సహకరిస్తున్నారా? లేదా? తదితర వివరాలను సేకరించినట్లు సమాచారం. పార్టీ గెలుపునకు అవకాశాలు ఉన్నాయని, కష్టపడితే విజయం సాధిస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం, ప్రణాళికలు తదితర అంశాలను చర్చించినట్లు సమాచారం.

Similar News