'కేసీఆర్ దృఢ సంక‌ల్పానికి ఉదాహ‌ర‌ణ' జ్యుడీషియల్ ఎంక్వైరీ వేళ వైటీపీఎస్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-25 05:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా వైటీపీఎస్ వీడియోను షేర్ చేస్తూ.. యాదాద్రి పవర్ స్టేషన్ లో ఒకటి, రెండు యూనిట్లలో బాయిలర్ లైట్ ప్రక్రియ విజయవంతమైందని గత వారం ఇంజినీర్లు చెప్పడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మొత్తం సామర్థ్యంతో 4000 మెగావాట్ల సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న దేశంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ వైటీపీఎస్ అని పేర్కొన్నారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం వైటీపీఎస్ నిర్వహణను బీహెచ్ఈఎల్ కు అప్పగించిందని ఈ ప్రాజెక్టు విలువ రూ.20,400 కోట్లు అని పేర్కొన్నారు. ఇది భారతదేశంలో విద్యుత్ రంగంలో పీఎస్ యూకి అందించిన అత్యధిక విలువ ఆర్డర్ అని పేర్కొన్నారు. 2014లో కేవలం 7770 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం నుండి, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణ స్థాపిత సామర్థ్యాన్ని దాదాపు 20,000 మెగావాట్లకు పెంచింది. ఇది మన దేశ చరిత్రలో అసమానమైన విజయగాథ అని, కేసీఆర్ దృఢమైన సంకల్పానికి వైటీపీఎస్ ఒక అద్భుతమైన ఉదాహరణ అన్నారు.

ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం జ జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి అధ్యక్షతన విచారణ సంఘం తన పనిని ఇప్పటికే మొదలు పెట్టింది. ఈ క్రమంలో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి బదులుగా సూపర్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగించడంతో పాటు డిస్కమ్‌లపై భారం పడేలా బొగ్గు గనులకు దూరంగా యాదాద్రి థర్మల్ పవర్‌ స్టేషన్‌ను దామరచర్లలో నిర్మించడానికి కారణాలపై విచారణ కమిటీ ఆరో తీస్తోంది. ఇటువంటి తరుణంలో కేటీఆర్ యాదాద్రి పవర్ ప్లాంట్ కేసీఆర్ దార్శనికతకు ఉదాహరణ అంటూ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News