తెలంగాణలో కొత్త బ్రాండ్ బీర్.. రేవంత్ సర్కార్‌పై క్రిశాంక్ సంచలన ఆరోపణలు..!

మద్యం తయారీ కంపెనీ సోం డిస్టలరీస్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు.. త్వరలోనే రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు

Update: 2024-05-27 12:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: మద్యం తయారీ కంపెనీ సోం డిస్టలరీస్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు.. త్వరలోనే రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రాబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోం డిస్టలరీస్, కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్‌లకు అనుమతి ఇవ్వలేదని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారని, కానీ ఇప్పుడు అదంతా అబద్దమని తేలిపోయిందని అన్నారు. సోం డిస్టిలరీస్ కంపెనీ ద్వారా కొత్త బీర్ కంపెనీని తెలంగాణకు తీసుకువస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చిన సోం డిస్ట్రీలరీలో కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ అవినీతికి పాల్పడ్డారని గతంలో కేసు నడిచిందని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సోం డిస్ట్రీలరీస్ సంస్థను సీజ్ చేశారని, ఆ కంపెనీ మీద అనేక సార్లు రైడ్స్ జరిగాయని అన్నారు.

2013-14లో 25 లక్షలు, 2019లో కోటీ 31 లక్షలు సోం డిస్ట్రీలరీస్ కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇచ్చిందని ఆరోపించారు.కేసీఆర్ హయాంలో తెలంగాణలో అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అక్రమ మద్యానికి తలుపులు తెరిచిందని ఫైర్ అయ్యారు. సాక్షాత్తు ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. సోం డిస్ట్రీలరీస్ కంపెనీ తెలంగాణకు వస్తున్న విషయం మంత్రి జూపల్లికి తెలుసా అని ప్రశ్నించారు. సోం డిస్ట్రీలరీస్ కంపెనీకి తెలంగాణలో బీర్లు అమ్మడానికి సీఎం రేవంత్ రెడ్డి డీల్ చేసి పర్మిషన్ ఇచ్చారా అని నిలదీశారు. సోం డిస్ట్రీలరీస్ కంపెనీ వలన మధ్యప్రదేశ్‌లో 65 మంది చనిపోయారని, దీంతో ఆ రాష్ట్రంలో కంపెనీని బ్యాన్ చేశారని అన్నారు. అలాంటి కంపెనీకి తెలంగాణలో అనుమతి ఇచ్చి రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News