దమ్ముంటే రసమయి రాజీనామా చేయాలి.. బీజేపీ నేత Konda Vishweshwar Reddy సవాల్

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో తండ్రి కొడుకుల అరాచక పాలన కొనసాగుతుందని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్

Update: 2022-09-02 11:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో తండ్రి కొడుకుల అరాచక పాలన కొనసాగుతుందని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ మాటలు విని కరీంనగర్ జిల్లా నిజంగానే అభివృద్ధి అయిందనుకున్నానని మండిపడ్డారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో నిర్వహించిన 'ప్రజా గోస - బీజేపీ భరోసా' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు సైతం సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు.

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేయలేదని విమర్శలు గుప్పించారు. దమ్ముంటే రసమయి రాజీనామా చేసి ఉపఎన్నిక ద్వారా మానకొండూర్ నియోజకవర్గాన్ని అభివద్ధికి తోడ్పడాలని సూచించారు. మానకొండూరులో లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం విచిత్రంగా ఉందన్నారు.

మునుగోడు ఎమ్మెల్యే రోజగోపాల్ రెడ్డి లాగా దమ్ము ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రసమయికి సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ తన ఎనిమిదేళ్ల పాలనలో ఏం చేశాడో ప్రజలకు చెప్పుకోలేకే వేరే రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడని ఎద్దేవా చేశారు. మూడెకరాల భూమి అడగకపోయినా ఇస్తానని దళితులకు హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశాడని.. ఇప్పుడు దళిత బంధు పథకంతో అదే తరహా మోసం చేయబోతున్నాడని ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెబుతున్న సీఎం కేసీఆర్.. లోయర్ మానేరు డ్యామ్ భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. విద్య, వైద్యం రంగాలపై అతి తక్కువగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని విమర్శించారు. 

Tags:    

Similar News