అభివృద్ధి కోసమే పార్టీ మారా

భద్రాచలం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని, అభివృద్ధి కోసమే పార్టీ మారానని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు.

Update: 2024-04-30 13:40 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని, అభివృద్ధి కోసమే పార్టీ మారానని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తలంపుతోనే రెండు దశాబ్దాలుగా రాజకీయాలలో కొనసాగుతున్నానని, నన్ను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించుకున్న ప్రజలకు రుణపడి ఉంటాను అని తెలిపారు. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారాను తప్ప ప్రలోభాలకు కాదని, భద్రాచలం చరిత్ర ఒకసారి చూసుకుంటే ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే భద్రాచలంలో ప్రతిపక్షం ఎమ్మెల్యే ఉండేవాడని, అందువలన నియోజవర్గం అభివృద్ధి చెందటం లేదనే కారణంతోనే పార్టీ మారానని తెలిపారు. మూడు నెలల్లోనే వెంకటాపురం మండలానికి జూనియర్ కళాశాల మంజూరు చేశామని,

    ఎన్నికల అనంతరం చర్ల మండలానికి ఫైర్ స్టేషన్, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో మంచినీటి సమస్య, ఇతర సమస్యలు అలాగే పై మండలంలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నవీకరణ చేసేందుకు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి రైతులకు సాగునీటి కష్టాల లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే దుమ్ముగూడెం మండలంలో గుర్రాలబైలు, లచ్చిగూడెంలో 3 కోట్ల రూపాయల నిధులతో చెక్ డ్యాం పనులు ప్రారంభించామని, చర్ల మండలంలోని పెద్ద మిడిసిలేరు లో కూడా రూ. 3.30 కోట్లతో చెక్​డ్యాం పనులు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. భద్రాచలం దేవస్థానం అభివృద్ధి, అయిదు పంచాయతీల విలీనం , ఇప్పటికే భద్రాచలంలో కరకట్ట పనులు జరుగుతున్నాయన్నారు. సొంతిల్లు లేని పేదలకు ఆ కల సాకారం చేస్తానని అన్నారు. పార్టీలకు అతీతంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.

Similar News