నది ఇరువైపులా ఉన్న గృహాలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్మాణం చేపట్టాలి

మున్నేరు నది ఇరువైపులా ఉన్న గృహాలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్మాణం చేయాలని మున్నేరు బ్రిడ్జి నిర్మాణ సంస్థ ప్రతినిధులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

Update: 2024-05-03 11:00 GMT

దిశ, ఖమ్మం : మున్నేరు నది ఇరువైపులా ఉన్న గృహాలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్మాణం చేయాలని మున్నేరు బ్రిడ్జి నిర్మాణ సంస్థ ప్రతినిధులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం మున్నేరుకి ఇరువైపులా నిర్మిస్తున్న సీసీ ప్రొటెక్షన్ వాల్ పనులపై నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం వలన మున్నేరుకి ఇరువైపులా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా నిర్మాణం ఉండాలన్నారు. వాల్ నిర్మాణం ప్రారంభం అయ్యే గోళ్లపాడు ఆనకట్ట నుండి చివరి ప్రకాష్ నగర్ ఆనకట్ట వరకు నిత్యం నీరు నిలువ ఉండేలా చర్యలు తీసుకోవాలని,అవసరమైతే మధ్యలో చిన్న చిన్న చెక్ డ్యాముల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఖమ్మంలో

    నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని బైపాస్ రోడ్డు నుండి ప్రకాష్ నగర్ బ్రిడ్జి వరకు ప్రొటెక్షన్ వాల్ ను ఆనుకుని డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. వాల్ నిర్మాణం వలన తలెత్తే డ్రైనేజీ సమస్యల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీర్లతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నిర్మాణం చేసే సమయంలో రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రాజ్,ఇరిగేషన్,విద్యుత్,పోలీస్, కేబుల్స్ విషయంలో బీఎస్ఎన్ఎల్ వంటి అన్ని శాఖల అధికారులు సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనల ప్రకారంగా నిర్మాణం చేయాలన్నారు. వాల్ నిర్మాణం వలన భవిష్యత్తులో నగరం మీద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. నిర్మాణ పనుల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.  


Similar News