Khammam లో నిరసన.. నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు
ఖమ్మం వ్యవసాయ పత్తి మార్కెట్లో ఖరీదు వ్యాపారాలు, దిగుమతి వ్యాపారులతో సహా గుమస్తాలు...Protest at Market
దిశ, ఖమ్మం సిటీ: ఖమ్మం వ్యవసాయ పత్తి మార్కెట్లో ఖరీదు వ్యాపారాలు, దిగుమతి వ్యాపారులతో సహా గుమస్తాలు జీఎస్టీకి వ్యతిరేకంగా ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ అమలులో అభ్యంతరాలు ఉన్నాయని ఖరీదు వ్యాపారుల తరఫున జీఎస్టీ కౌన్సిల్ తో సహా మంత్రి హరీష్ రావుతో సహా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ను కలిసినప్పటికీ తమ సమస్యలు పట్టించుకునే నాథుడే కరువైనట్లు వ్యాపారులు పేర్కొన్నారు. 2017 నాటి నుండి జీఎస్టీకి సంబంధించి సేల్స్ పై డబ్బులు కట్టినవాటిని రిఫండ్ చేయకపోగా ఇప్పుడు కొనుగోళ్లపై జీఎస్టీ కట్టాలంటూ వ్యాపారులకు నోటీసుల మీద నోటీసులు పంపుతూ జీఎస్టీ అధికారులు తమపై ఒత్తిడి పెంచడం సరైన పద్ధతి కాదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
సుమారు రెండు గంటల పాటు పత్తి మార్కెట్లో కొనుగొలును నిలిపేసిన వ్యాపారులు మార్కెట్ గేటు ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్ వ్యాపారుల పట్ల ప్రభుత్వాలు మొండి వైఖరి వహిస్తున్నాయని తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎగుమతి శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొడవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీఎస్టీ అధికారులు తమ వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ రూ. కోట్ల పన్నులు కట్టాలని ఒత్తిడి చేయడంపై తమ శాఖ తరపున వ్యతిరేకిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేగాక ఇప్పటికే రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడామని సోమవారం నుండి పత్తి కొనుగోలు నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తామని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎగుమతి శాఖ అధ్యక్షులు నల్లమల ఆనంద్ మాట్లాడుతూ జీఎస్టీ పేరుతో అధికారులు తమపై అధిక భారం మోపుతూ వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారన్నారు. మార్కెట్ కమిటీ సెక్రటరీ రుద్రాక్షల మల్లేశం మాట్లాడుతూ ఖమ్మం మార్కెట్లో వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జేసీకి తెలియజేసినట్లు తెలిపారు. నేటి సాయంత్రం 6 గంటలకు ఖరీదు దారులతో సహా జీఎస్టీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దిగుమతి శాఖ అధ్యక్ష కార్యదర్శులు దిరిశాల వెంకటేశ్వర్లు, ముత్యం ఉప్పల్ రావు, పత్తి శాఖ వ్యాపారులు, చాంబర్ ఆఫ్ కామర్స్ సహాయ కార్యదర్శి మన్నెం కృష్ణ, రామా శ్రీను, సత్యం బాబు, చెరుకూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.