నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా రైతాంగం కోసం పని చేస్తా..

నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా రైతాంగం కోసం పని చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Update: 2024-05-26 10:26 GMT

దిశ, ఖమ్మం : నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా రైతాంగం కోసం పని చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యంలో ఆదివారం రఘునాథ పాలెం మండలం బాలపేటలో పామాయిల్ రైతులకు పామాయిల్ సాగు పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత ప్రభుత్వాల్లో తాను ప్రజాప్రతినిధి గా ఉన్నప్పుడు రైతుల పక్షాన నిలబడిన విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు గోదావరి జలాలను అందించేందుకు పనులు వేగంగా సాగుతున్నాయి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ను గోదావరి జలాలతో సస్య శ్యామలం చేయడమే తన రాజకీయ లక్ష్యమన్నారు.‌ పామాయిల్ వ్యవసాయంతో ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అన్నారు. పామాయిల్ సాగుతో రైతాంగం రాజుగా మార్చాలనేదే తన తపన అని, దాని కోసం పామాయిల్ వ్యవసాయం గురించి అనేక అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.

    నాడు ఎన్టీఆర్ పామాయిల్ తొలి మొక్క నాటారని గుర్తు చేశారు. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలు పామాయిల్ సాగుతోనే సాధ్యమన్నారు‌. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండేందుకు అనేక కార్యక్రమాలను చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. పామాయిల్ సాగు చేసే రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలో ఎక్కడాలేని విధంగా ఖమ్మం జిల్లాలో పామాయిల్ తోటలు అధికంగా సాగు చేసి అధికంగా సాగుచేసి తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి రైతులను కోరారు. గత ప్రభుత్వాల అసమర్థ పాలనతో వ్యవసాయంపై

    రైతులు నమ్మకం కోల్పోయారన్నారు. దానికి తోడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇంపోర్ట్ సుంకం తగ్గించడం వల్ల పామాయిల్ గెలల ధరలు తగ్గాయని విమర్శించారు. మన దేశం పామాయిల్ దిగుమతుల విలువ ప్రతి ఏడాది లక్ష కోట్ల వరకు ఉందన్నారు. పామాయిల్ సాగు చేసే రైతులు అంతర పంటగా కోకో, వక్కా, జాజికాయ పంటలు వేసుకుంటే రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పామాయిల్ సాగుకు తెలంగాణ భూములు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం పామాయిల్ సాగుపై మక్కువ చూపాలన్నారు. అనంతరం రఘునాథ పాలెంలో పామ్ ఆయిల్ పంటలను సందర్శించారు.

Similar News