కాసులిస్తేనే సర్టిఫికెట్లకు డిజిటల్ సిగ్నేచర్

వైరా తహసీల్దార్ కార్యాలయంలో కాసులు ఇవ్వనిదే ఏ సర్టిఫికెట్ కైనా డిజిటల్ సిగ్నేచర్ కావటం లేదు.

Update: 2024-04-27 10:37 GMT

దిశ, వైరా : వైరా తహసీల్దార్ కార్యాలయంలో కాసులు ఇవ్వనిదే ఏ సర్టిఫికెట్ కైనా డిజిటల్ సిగ్నేచర్ కావటం లేదు. ఆదాయం సర్టిఫికెట్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ వరకు అప్రూవల్ కావాలంటే చెప్పులు అరిగేలా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు కాసులు ఇస్తేనే సర్టిఫికెట్లు అప్రూవల్ చేస్తుండటం విశేషం. మండలంలోని ప్రజలు తమ అవసరాల కోసం మీసేవ కేంద్రాల్లో ఆదాయ, కుల, ఫ్యామిలీ మెంబర్, కళ్యాణ లక్ష్మి పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ దరఖాస్తులను గిర్దావర్లు వెంటనే విచారించి ధ్రువీకరిస్తున్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ తో పాటు తహసీల్దార్ ఆ దరఖాస్తులపై అప్రూవల్ సంతకాలు పెడుతున్నారు. అయితే తహసీల్దార్ సంతకాలు అయిన తరువాత ఆన్లైన్ లో డీఎస్ సంతకాలతో అప్రూవల్ చేసేందుకు ఓ కాంట్రాక్టు ఉద్యోగిని తీవ్ర జాప్యం చేస్తున్నారు.

     నిబంధనల ప్రకారం తహసీల్దార్ ఇనిషియల్ అయిన వెంటనే మీసేవ ఆన్లైన్ లో డిజిటల్ సంతకాలకు అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. అయితే అలాకాకుండా రోజుల తరబడి ఆ సర్టిఫికెట్లను సదరు కాంట్రాక్టర్ ఉద్యోగిని పెండింగ్లో పెడుతుంది. అధికారులంతా సర్టిఫికెట్లను ధ్రువీకరించినప్పటికీ దరఖాస్తుదారులని తన వద్దకు రప్పించుకొని కొర్రీలు పెడుతుందని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా రోజుల తరబడి సర్టిఫికెట్లను పెండింగ్లో పెట్టి దరఖాస్తుదారుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. సదరు కాంట్రాక్టర్ ఉద్యోగిని వేధింపులకు గురైన కొంతమంది దరఖాస్తుదారులు తమ ఆవేదనను దిశకు తెలిపారు. అధికారులు సంతకాలు అన్నీ పూర్తయిన దరఖాస్తులను సదరు ఉద్యోగిని తన వద్ద ఉంచుకొని ఆ దరఖాస్తులోని ఫోన్ నెంబర్ల ఆధారంగా దరఖాస్తుదారులకు ఫోన్ చేసి కార్యాలయానికి పిలిపించుకుంటున్నారు. కార్యాలయానికి వచ్చిన వారి వద్ద అక్రమంగా నగదును వసూలు చేస్తున్నారు.

     లేదంటే అనవసర కొర్రీలు పెట్టి వారిని వేధిస్తున్నారు. నిబంధనల ప్రకారం డీఎస్ అప్రూవల్ కోసం ప్రభుత్వ ఉద్యోగిని నియమించాల్సి ఉంది. అయితే అలా కాకుండా ఎన్నికల విధుల కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్న ఉద్యోగినికి ఆ విధులు కేటాయించటం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. కార్యాలయంలో బహిరంగంగానే సదరు ఉద్యోగిని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అధికారులు అంతా సంతకాలు చేసిన తరువాత ఒక్కో దరఖాస్తు ఎన్ని రోజులు పెండింగ్ ఉందో పరిశీలిస్తే ఇక్కడ జరుగుతున్న బాగోతం అర్ధం అవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఓ

     కాంట్రాక్టు ఉద్యోగినికి డిజిటల్ సిగ్నేచర్ అప్రూవల్ కీలక బాధ్యతలు అప్పజెప్పటం ఏంటని రెవెన్యూ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కాసుల కోసం డిజిటల్ సిగ్నేచర్ అప్రూవల్ చేయకుండా దరఖాస్తుదారులను వేధిస్తున్న ఉద్యోగిని పై చర్యలు తీసుకొని వెంటనే దరఖాస్తుదారులకు సర్టిఫికెట్లు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై వైరా డిప్యూటీ తహసీల్దార్ సురేష్ బాబును దిశ వివరణ కోరగా డిజిటల్ సిగ్నేచర్ అప్రూవల్ రోజుల తరబడి ఆలస్యం జరుగుతుందనే విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. ఈ విషయమై విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Similar News