బీజేపీ చెప్పిందే చేస్తుంది...చేసేదే చెప్తుంది

భారతీయ జనతా పార్టీ ప్రజలకు చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుందని కాకతీయ వంశస్తుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ అన్నారు.

Update: 2024-05-07 14:21 GMT

దిశ, దమ్మపేట : భారతీయ జనతా పార్టీ ప్రజలకు చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుందని కాకతీయ వంశస్తుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ అన్నారు. మంగళవారం దమ్మపేట మండల కేంద్రంలోని నెమలిపేట గ్రౌండ్లో ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ కమలదళం శంఖారావం సభలో కాకతీయ వంశస్తుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని, ప్రధానమంత్రి మోడీ సారథ్యంలో పదేళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. నరేంద్ర మోడీ హరిజన, గిరిజన ప్రజలకు ఎన్నో పదవులు ఇచ్చారని,

    మొట్టమొదటిసారి ఒక ఆదివాసి మహిళను రాష్ట్రపతిని చేసింది బీజేపీ అని, అందుకుగాను ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసి బిడ్డలందరూ బీజేపీకి మద్దతుగా ఉండాలని కోరారు. కరోనా సమయంలో దేశంలో ఉన్న ప్రజలతోపాటు మరికొన్ని దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని అన్నారు. కాకతీయ వంశస్తుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ ప్రసంగిస్తున్న సమయంలో బహిరంగ సభలో వర్షం పడుతుండగా బస్టర్ రాజులు ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు పడతాయని, ఏ ప్రాంతంలో అడుగుపెడితే ఆ ప్రాంతం సుభిక్షంగా మారుతుందని తెలపడంతో అక్కడ సభ ప్రాంగణం అంతా ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు చప్పట్లతో మారు మోగింది. ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ తన మిత్రుడని, ఆయనను ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో వెనకబడింది : ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి వినోద్​రావు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ఎంతో వెనుకబడిందని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్​ రావు అన్నారు. ప్రపంచంలో గొప్ప దేశం భారతదేశమని, కానీ ఆ భారతదేశంలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏం పాపం చేసిందో తెలియదు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చారు కానీ వాటిని ఉపయోగించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలకు చేతకాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క మెరుగైన ప్రభుత్వ ఆసుపత్రి కానీ, కాలేజీలు కానీ, పరిశ్రమలు కానీ లేవని, ఇవన్నీ ఉంటేనే జిల్లా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

    తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, ఒక్కసారి అవకాశం కల్పిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధిలో ముందు ఉంచుతానని అన్నారు. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు ఇస్తామని హామీ ఇచ్చి, వాటిని అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. తెలుగుదేశం, ఎమ్మార్పీఎస్, జనసేన నాయకులు బీజేపీకి మద్దతు పలకడం సంతోషకరమని, అందరి సమిష్టి కృషితో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ రామారావు, నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, గొట్టిపుల్ల దుర్గా శ్రీనివాసరావు, ఉడతనేని విశ్వేశ్వరరావు ,దారా నాగేశ్వరరావు, పసుమర్తి పుల్లారావు, నాగరాజు పాల్గొన్నారు. 

Similar News