కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ సంబరాలు ఎందుకు.. పుట్ట మధుకర్

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మంథని ప్రాంతంలో సంబరాలు ఎందుకని జడ్పీచైర్మన్ పుట్ట మధుకర్ ఎద్దేవా చేశారు.

Update: 2023-05-25 09:04 GMT

దిశ, మంథని : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మంథని ప్రాంతంలో సంబరాలు ఎందుకని జడ్పీచైర్మన్ పుట్ట మధుకర్ ఎద్దేవా చేశారు. రామగిరి మండలం చందనాపూర్ లో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీధర్ బాబుకు అధికారం తప్ప ప్రజాసమస్యలు పట్టవన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే సింగిరెడ్డి పల్లె, పెద్దంపేట్ తదితర సింగరేణి నిర్వాసిత గ్రామాల ప్రజల సమస్యలు ఏనాడు పట్టించుకోలేదన్నారు. నాడు మంత్రిగా ఉన్నా.. నేడు ఎమ్మెల్యేగా ప్రజలకు ఏనాడు అండగా నిలవలేదన్నారు.

సింగరేణి సంస్థ ఊర్లకు ఊర్లు తీసుకుంటే నిర్వాసితులకు పరిహారం, పునరావాసం గురించి పట్టించుకోలేదన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా ఎక్కడో పెళ్లి జరిగితే మరెక్కడో సంబరాలు చేసుకున్నట్లు ఎమ్మెల్యే తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా వేతనం తీసుకుంటూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం, ఇక్కడి ప్రజలు, రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లక పోవడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికైనా సంబరాలు ఆపి ఎమ్మెల్యే ప్రజాసమస్యల పై శ్రద్ధ వహించాలన్నారు.

Tags:    

Similar News