దుబాయ్‌లో మోసపోయాను దయచేసి కాపాడండి.. గల్ఫ్ బాధితుడు

ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వస్తే ఓ ముఠా తనను మోసం

Update: 2024-05-26 09:17 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి : ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వస్తే ఓ ముఠా తనను మోసం చేసిందని దుబాయ్ లో ట్రావెల్ బ్యాన్ కు గురైన జగిత్యాల వాసి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల కు చెందిన గొల్లపెల్లి రాజేష్ (39) ఆరు నెలల కిందట ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళాడు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న క్రమంలో ఓ ముఠా జాబ్ ఇప్పిస్తామని నమ్మించి తనతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించారని బాధితులు వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ లోగా ఇండియాకి వెళ్లి రావాలని ముఠా సభ్యులు సూచించడంతో స్వదేశానికి వస్తున్న క్రమంలో అబుదాబి ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అరెస్టు చేసినట్లు రాజేష్ తెలిపాడు. జాబ్ ఇప్పిస్తానని నమ్మించిన ముఠా సభ్యులు తన ప్రమేయం లేకుండా లోన్లు తీసారని దీంతో ట్రావెల్ బ్యాన్ కు గురయ్యానని కన్నీటి పర్యంతమయ్యాడు. కేసు పూర్తయ్యేంతవరకు దేశం విడిచి వెళ్లే పరిస్థితి లేదని ప్రభుత్వం కలగజేసుకొని తనను ఇండియా కి రప్పించే ఏర్పాటు చేయాలని రాజేష్ విలపించాడు.

ఇండియాకు తీసుకురాకుంటే ఆత్మహత్యే శరణ్యం : రాజేష్ కుటుంబ సభ్యులు

దుబాయ్ లో బ్యాంకు మోసాల ముఠా ఉచ్చులో చిక్కిన రాజేష్ ను రక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ విషయమై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎంఓ దృష్టికి తీసుకెళ్లి సీఎస్ ద్వారా దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి ఈనెల 18న వైర్ లెస్ మెసేజ్ పంపించారు. ఈ రాజేష్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అన్నం తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నామని ప్రభుత్వం స్పందించి రాజేష్ ని ఇండియాకు తీసుకురావాలని లేదంటే కుటుంబం అంతా ఆత్మహత్యకు సిద్ధపడతామని తెలిపారు.

Similar News