గ్రామాల్లో మొదలైన పంచాయతీ ఎన్నికల సందడి.. రిజర్వేషన్లపై జోరుగా చర్చ

మొన్నటి వరకు గ్రామాల్లో లోక్‌సభ ఎన్నికల హడావిడిలో మునిగితేలిన

Update: 2024-05-22 09:23 GMT

దిశ, సైదాపూర్ : మొన్నటి వరకు గ్రామాల్లో లోక్‌సభ ఎన్నికల హడావిడిలో మునిగితేలిన నాయకులకు.. ఇక పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఈ యేడాది జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగిసిపోయింది. ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోనే పల్లెలు కాలం వెల్లదీస్తున్నారు. జూన్‌, జూలైలోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయని వార్తలు గుప్పుమనడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించిందన్న వార్తలు గ్రామాల్లో కోడై కూస్తున్నాయి. ఐదు నెలల క్రితమే ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బంది వివరాలను టీ పోల్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ఇప్పటివరకు గ్రామ పంచాయతీల వారీగా అమల్లో ఉన్న రిజర్వేషన్ల వివరాలను జిల్లా పంచాయతీ అధికారుల నుండి సేకరించింది. ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీ వార్డుల వారీగా విభజించి అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికి మండలంలో మొత్తం 32,400 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 26 గ్రామపంచాయతీలు, 234వార్డులు ఉండగా.. వీటికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

ఇదిలా ఉండగా,ఆయా గ్రామాల్లో సర్పంచులుగా కావాలనే ఆశతో ఉన్న వివిధ పార్టీల నాయకులు తమ పంచాయతీ, వార్డుల్లో ఏ రిజర్వేషన్‌ వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులు రిజర్వేషన్ల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిన్న మొన్నటి వరకు లోక్‌సభ ఎన్నికల్లో బిజీ బిజీగా ఉన్న నాయకులు ఇకనుంచి పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కాక తప్పడం లేదు. ఎన్నికల సమయం రోజు రోజుకూ దగ్గర పడుతుండడంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతుందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అంతే కాకుండా గ్రామాల్లో ఎక్కువశాతం బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిదులు ఉండగా.. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొందరు బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరేందకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అంతే కాకుండా గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఇప్పటి నుంచే యువతను మచ్చిక చేసుకోవడానికి విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఏమవ్వా బాగున్నావా? ఏం తాత బాగున్నావా? అంటూ ఆప్యాయతతో పలకరింపులు మొదలయ్యాయి. కొన్ని గ్రామ పంచాయతీల్లో మాత్రం ఒక్కో ఓటుకు రూ.5 వేల నుంచి 10 వేలు ఖర్చు చేయడానికి నేతలు తగిన వనరులను సమకూర్చు కుంటున్నట్లు సమాచారం.

Similar News