ఆటో డ్రైవర్ల జీవితాలను చిదిమేసిన కాంగ్రెస్ ప్రభుత్వం : కొప్పుల ఈశ్వర్

కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలతో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున

Update: 2024-05-07 13:42 GMT

దిశ,గోదావరిఖని : కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలతో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం స్థానిక బస్టాండ్ ఆవరణలో ఆటో డ్రైవర్లు చేపట్టిన నిరసన దీక్షకు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ తో కలిసి హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని నమ్మబలికి అధికారంలోకి వచ్చి.. ప్రజలను నట్టేట ముంచిందని అన్నారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రజలను మోసం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అన్ని వర్గాల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని మెలగాల్సిన ప్రభుత్వం, కొన్ని అనాలోచిత నిర్ణయాలతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు వీధిన పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతు పలకడం లేదని, బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా, న్యాయమైన సమస్యకు ఆటో డ్రైవర్ల పక్షాన అండగా నిలవడం తమ బాధ్యతన్నారు. ఆటో డ్రైవర్ల న్యాయపరమైన డిమాండ్ల కోసం జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వారన్నారు. పంటలు ఎండిపోయి రైతులు చనిపోయిన.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్న బాధిత కుటుంబాలను పలకరించిన పాపాన పోలేదని అన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని.. ఎటువంటి కార్యచరణను అమలు చేయడానికైనా సిద్ధంగా ఉందని వారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News