ఎంసెట్ పరీకలో అంతరాయం.. ఆందోళనలో తల్లిదండ్రులు

ఎంసెట్ ఎగ్జామ్స్ అటు పరీక్ష రాసే విద్యార్థుల తో పాటు వారి

Update: 2024-05-07 16:05 GMT

దిశ, తిమ్మాపూర్ : ఎంసెట్ ఎగ్జామ్స్ అటు పరీక్ష రాసే విద్యార్థుల తో పాటు వారి తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమైన సంఘటన మంగళవారం తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ లోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష సమయం కాగా 3 గంటలకు పరీక్షా కేంద్రం లోకి వెళ్లిన విద్యార్థులు రాత్రి 7 గంటలైనా బయటకు రాకపోవడం తో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. అసలు పరీక్ష కేంద్రంలో ఏం జరుగుతుందో చెప్పే వారు లేకపోవడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను పరీక్ష కేంద్రం లోకి అనుమతించకపోవడం తో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఉన్న రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దాదాపు అరగంట పాటు నిర్వహించిన రాస్తా రోకో తో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయించి రాస్తారోకో ను విరమింపజేశారు.

జనరేటర్ లో తలెత్తిన లోపమే ఆలస్యానికి కారణం..

అయితే విద్యార్థులు రాసే ఎంసెట్ పరీక్ష ఆన్లైన్ లో నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా కళాశాలలో ఉన్న జనరేటర్ ఆన్ చేసి పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే సాయంత్రం గాలి, వాన తీవ్రం కావడంతో పాటు కళాశాల సమీపంలో లో పిడుగు పడటం తో జనరేటర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కళాశాల యాజమాన్యం స్పందించి జనరేటర్ ను మరమ్మత్తు చేసే వరకు దాదాపు గంట సమయం పట్టడంతో పరీక్ష నిర్వాహకులు విద్యార్థులకు అదనంగా గంట సమయం కేటాయించగా ఆలస్యం అయిందని కళాశాల యాజమాన్యం తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Similar News