జోరుగా అక్రమ ఇసుక,మట్టి రవాణా.. పట్టించుకోని అధికారులు

జమ్మికుంట మండలం లో అక్రమంగా ఇసుకను, చెరువుల్లో మట్టిని

Update: 2024-05-26 12:34 GMT

దిశ,జమ్మికుంట : జమ్మికుంట మండలం లో అక్రమంగా ఇసుకను, చెరువుల్లో మట్టిని తరలించే వారి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా యథేచ్చగా కొనసాగుతుంది. ఇసుక, మట్టి రవాణాపై గ్రామస్తులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీణవంక, జమ్మికుంట మండలాల పరిధిలో మానేరు పరివాహక గ్రామాలు ఉండడం వల్ల ఆయా గ్రామాలకు చెందిన ఇసుక ట్రాక్టర్ల యజమానులు ఇష్టారాజ్యంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ప్పటికీ, సంబంధిత అధికారులు మాత్రం వారిపై చర్యలు తీసుకోకుండా వ్యవహరించడంతో ఇసుక దందా జోరుగా కొనసాగుతోంది. ఇసుక రవాణా దారులు తమ ట్రాక్టర్లను వేగంగా, స్పీడుగా నడపడం వల్ల ఆయా గ్రామాల్లోని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మితిమీరిన వేగంతో ఇసుక ట్రాక్టర్లు తమ గ్రామాలగుండా వెళ్లడంతో రోడ్డుపైకి రావాలంటే భయపడాల్సి వస్తుందని, ఏ ప్రమాదం జరుగుతుందో అని నిత్యం భయాందోళనకు గురవుతున్నామని గ్రామాల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శనివారం మడిపల్లి గ్రామంలో గ్రామస్తులు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఒక్కో ట్రాక్టర్ కు ఒక్క పర్మిట్ తీసుకొని అదే పర్మిట్ పై అనేక ట్రిప్పులు ఇసుక రవాణా చేస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ట్రాక్టర్ల యజమానులు వారి అనుచరులు ఇసుక రవాణా చేసే సమయంలో ట్రాక్టర్ కంటే ముందే వెళ్లి పోలీసుల కదలికలను పసిగట్టి ట్రాక్టర్ డ్రైవర్లకు ఫోన్లు చేస్తూ సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఈ సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ ఒక చేత్తో సెల్ ఫోన్ లో మాట్లాడుతూ, మరో చేత్తో ట్రాక్టర్లను వేగంగా నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. జమ్మికుంట పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించినట్లయితే ఇసుక ట్రాక్టర్ల కదలికలను పసిగట్టి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవచ్చని ప్రజలు తెలుపుతున్నారు.

మట్టి దందాపై ఫిర్యాదుల వెల్లువ..

జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో చెరువులోని మట్టిని ఇటుక బట్టీలకు ప్రజాప్రతినిధులు అమ్ముకుంటున్నారని గ్రామానికి చెందిన వ్యక్తులు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. అయితే మండల స్థాయి అధికారులు మట్టి అమ్మకాలపై చర్యలు తీసుకోకపోవడంతో మాచనపల్లి గ్రామానికి చెందిన బండారి కుమార్, దొంతరవేన రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు శనివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్ కలిసి అక్రమ మట్టి తరలింపు పై ఫిర్యాదు చేశారు.

గ్రామ ఎంపీటీసీ సభ్యుడు పోల్సాని రాజేశ్వరరావు, తాజా మాజీ సర్పంచ్ బొజ్జం కల్పన భర్త తిరుపతి రెడ్డి, మాజీ వార్డు సభ్యురాలు లతా, పంచాయతీ కార్యదర్శి శివరంజని, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అనురాధ కుమ్మక్కై రైతులకు చెందాల్సిన ఊరకుంట చెరువు మట్టిని ఇటుక బట్టీల వ్యాపారులకు అమ్ముకున్నారని ఫిర్యాదు చేశారు. కాగా అక్రమ ఇసుక రవాణా, అక్రమ మట్టి తరలింపు పై ఫిర్యాదులు వెల్లువెత్తిన ప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు వెళ్లాయి. దీంతో ఏం జరగనుందో వేచి చూద్దాం.

Similar News