‘దిశ’ ఎఫెక్ట్.. సీఎంవోకు చేరిన వేములవాడ రామమందిరం ఇష్యూ

దిశ కథనానికి అనూహ్య స్పందన లభించింది.

Update: 2024-05-26 15:21 GMT

దిశ, వేములవాడ, రాజన్న సిరిసిల్ల : దిశ కథనానికి అనూహ్య స్పందన లభించింది.(నిన్న) శనివారం "రామ మందిర్ వీధిలో రాముడేక్కడ...?" అనే శీర్షికన దిశ దిన పత్రికలో ప్రచురితమైన వార్త కథనానికి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు ఆదివారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇంచార్జ్ ఈ.వో రామకృష్ణతో పాటు దేవాదాయ శాఖకు చెందిన పలువురు అధికారులు రామ మందిర్ వీధిలోని రామాలయాన్ని సందర్శించి, అక్కడి ప్రస్తుత పరిస్థితులను పరిశీలించారు. ఏది ఏమైనప్పటికీ వేములవాడ పట్టణంలో కనుమరుగైన రామ మందిరం విషయాన్ని కూకటి వేళ్ళతో సహా బయటకు తీసి ప్రచురించిన దిశ యజమాన్యానికి జిల్లా ప్రజలు, భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పటికైనా రామ మందిరం లోని రాముని దర్శనం లభించేనా అంటూ జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.

సీఎంవో కు చేరిన ఇష్యూ..

రామాలయానికి సంబంధించి దిశలో ప్రచురితమైన ప్రత్యేక వార్తా కథనం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారి చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) వరకు చేరినట్లు తెలిసింది. దీంతో వెంటనే స్పందించిన అక్కడి అధికారులు విషయంపై దేవాదాయ శాఖ కమిషనర్ ను ఆరా తీయగా ఆయన వెంటనే రాజన్న ఆలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణకు సమాచారం అందించి రామాలయాన్ని సందర్శించాలని ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణ రామాలయాన్ని సందర్శించి, సమగ్ర నివేదికను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పూర్తి నివేదిక సమర్పించనున్న ఆలయ ఈవో..

ఇదే విషయంపై ఆలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణ ను వివరణ కోరగా రామాలయాన్ని సందర్శించిన విషయం నిజమేనని, స్థానిక పోలీసుల సహకారంతో పాటు తమ సిబ్బందితో కలిసి ఆలయాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు. అయితే వెళ్లిన సమయంలో ఆలయ తలుపులు తాళం వేసి మూసి ఉన్నాయని, పక్కనే ఉన్న ఇంటి యజమానులు అందుబాటులో లేరని అన్నారు. అయినప్పటికీ అక్కడి ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేసి నివేదికను తయారు చేస్తున్నామని, రెవెన్యూ శాఖ నుంచి కూడా పూర్తిస్థాయి ఆధారాలు సేకరిస్తామని వివరించారు. మళ్లీ రామ మందిరాన్ని సందర్శించి ఆలయ పూర్తిస్థాయి నివేదికను తయారు చేసి, దేవాదాయ శాఖ కమిషనర్ కు పంపించనున్నట్లు తెలిపారు.

సమాచారం లీక్..

ఇదిలా ఉండగా రాజన్న ఆలయ ఇన్చార్జి ఈఓ తో పాటు దేవాదాయ శాఖ అధికారులు రామాలయం సందర్శనకు వస్తున్నారనే సమాచారం లీక్ అయినట్లు తెలుస్తోంది. అధికారులు అక్కడికి వెళ్ళగానే సమీపంలో ఎవ్వరూ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఆలయానికి సంబంధించిన వ్యక్తులే అక్కడివారికి ముందస్తుగా సమాచారం అందించినట్లు గుసగుసలు వినిపించాయి. ఏది ఏమైనా ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడనే నానుడికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది ఈ లీక్ విషయం. సమాచారాన్ని లీక్ చేస్తున్న సదరు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Similar News