అబద్దాల హామీలతో కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : కొప్పుల ఈశ్వర్

దొంగ హామీలతో.. అమలుకాని గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన

Update: 2024-05-11 15:01 GMT

దిశ, గోదావరిఖని : దొంగ హామీలతో.. అమలుకాని గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో అవస్థలు పడుతున్న ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ వెన్నంటి నిలిచి..శ్రీరామరక్షగా ఉంటుందని పెద్దపల్లి బwఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం స్థానిక ప్రధాన చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ తో కలిసి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు యోచిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని.. వనరులు ప్రజలకే వర్తించాలని బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. యువత ఉద్యోగాల కోసం, ఐటీ, వ్యవసాయ, తదితర రంగాల్లో అభివృద్ధి చెందడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేశారని అన్నారు.

గత ఎన్నికల సమయంలో కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు . కేసీఆర్ ప్రజల సంక్షేమ కోసం ప్రవేశపెట్టిన పథకాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొందని అని తెలిపారు. చెప్పాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేసారని అన్నారు. కార్మికుల ఐటీ మినహాయింపుకు కృషి చేస్తానని.. హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నించిన బిజెపిది హీనమైన చరిత్రని, విదేశీ బొగ్గును కొనుగోలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేసిన చరిత్ర బిజెపికి ఉందని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ లకు ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే బిజెపికి ఓటు వేస్తే రాష్ట్రం చిన్నాభిన్నమవుతుందని హెచ్చరించారు.ఈనెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతుగా ఉండి కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News