రెండు పార్టీలు ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ : కేటీఆర్

పార్లమెంటు ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలకు రాష్ట్ర ప్రజలు

Update: 2024-05-14 12:42 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పార్లమెంటు ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలకు రాష్ట్ర ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని, రెండు పార్టీల కంటే తామే అత్యధిక సీట్లు గెలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ చేపట్టిన పోరుబాట కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని, కేసిఆర్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాయని, ఏ జిల్లాకు వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు.

17 రోజుల బస్సు యాత్రలతో దేశాది నేతలంతా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమపై కుట్రలు, కుతంత్రాలు చేసిన క్రమంలో పరావం పాలైన, పార్లమెంటు ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను ముచ్చెమటలు పట్టించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు, కుతంత్రాలను పన్ని కేసులు పెట్టి భయపెట్టిన అద్భుతంగా పనిచేసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ముచ్చెమటలు పట్టించారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చే ఐదు నెలలైనా కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని, ఎన్నికల్లో రైతులు, మహిళలు, వృద్ధులతో పాటు అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీపై విముఖత చూపించాయని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలను తొలగించాలని చూస్తూ, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ అన్న చందంగా కొన్ని చోట్ల బలహీనమైన డమ్మీ అభ్యర్థులను పెట్టి, బిజెపి గెలుపుకు రేవంత్ రెడ్డి కష్టపడ్డాడన్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్యారాషూట్ లీడర్లను దింపారని, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ బలమైన అభ్యర్థులను పెట్టామని, రాష్ట్రంలో రెండు పార్టీల కంటే తామే ఎక్కువ లోక్ సభ సీట్లు గెలుచుకుంటామన్నారు. దేశంలో ఎన్డీఏ, ఇండియా రెండు కూటమిలకు స్పష్టమైన మెజారిటీ రాదని, ప్రాంతీయ పార్టీలే దేశ రాజకీయాలను శాసిస్తాయని జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు బలమైన పార్టీ అని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని, ఈనాడు ఆనాడు బిఆర్ఎస్సే తెలంగాణకు శక్తిని అన్నారు. తమ పార్టీ నుండి కొంత మందిని గుంజుకున్నా, పార్లమెంటు ఎన్నికల్లో మళ్ళీ పుంజుకున్నామని కార్యకర్తల కష్టం స్థానిక సంస్థల ఎన్నికలకు పునాది కాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ జింధం కళ, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు చక్రపాణి,బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News