కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కారు దిగనున్న పదిమంది కార్పొరేటర్లు

మరో వారం రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తున్నారు కార్పొరేటర్లు.

Update: 2024-05-03 02:31 GMT

దిశ, కరీంనగర్ బ్యూరో: మరో వారం రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తున్నారు కార్పొరేటర్లు. గత కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే వ్యవహారంతో అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నేడు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కండువా కప్పుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. నేడు సాయంత్రం సిరిసిల్లలో సీఎం సభలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే తీరుపై విసిగిన కార్పొరేటర్లు గత కొద్దిరోజులుగా స్థానిక ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కాని కార్పొరేటర్లు తాజాగా తీసుకున్న నిర్ణయంతో కరీంనగర్‌లో ఆ పార్టీ ఖాళీ కానుంది. అయితే, పది మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరుతుండగా మరో నలుగురు బీజేపీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

అభివృద్ధిలో వివక్ష..

పార్టీ మారుతున్న కార్పొరేటర్లు స్థానిక ఎమ్మెల్యే అధికారంలో ఉండగా అభివృద్ధి పనులు కేటాయించడంలో వివక్ష చూపాడని ఆరోపిస్తున్నారు. కొంతమంది తన సామాజికవర్గానికి చెందిన కార్పొరేటర్లనే అందలం ఎక్కించుకుని కరీంనగర్‌లో అరాచకాలకు పాల్పడ్డారని, కేసులై జైలుకు వెళ్లిన వారికి తన వద్ద ప్రత్యేక స్థానమే ఉందని ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ఆరోపణలు ఎదుర్కొని జైళ్లకు వెళ్లొచ్చిన కార్పొరేటర్లను ప్రత్యేక ఫండ్ ఇచ్చి విదేశాలకు విహారయాత్రలకు పంపించాడని, అలాంటి స్వభావం కలిగిన నాయకుడితో ఉండే కన్నా పార్టీ మారడడమే ఉత్తమమని కార్పొరేటర్లు వాపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా పార్టీ మారనున్నారు అనే ఊహాగానాలకు కార్పొరేటర్లు నేటితో తెరదించనున్నారు. నేడు సిరిసిల్లలో జరిగే సీఎం రేవంత్‌రెడ్డి సభలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లు భూ ఆక్రమణల కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతిని వెంటిలెటర్‌పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీకి మిగిలి ఉన్న పదిమంది కార్పొరేటర్లు పార్టీని వీడడం, ఇంకొందరు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడం ఉద్యమ పార్టీకి కరీంనగర్‌లో కోలుకోలేని దెబ్బే.

Similar News