సమస్యల్లో ఆదర్శ.. ముంపు ప్రాంతంలో మోడల్ స్కూల్ ఏర్పాటు

కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను

Update: 2024-05-24 11:43 GMT

దిశ,సైదాపూర్ : కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆదర్శ పాఠశాలలను ప్రారంభించింది. కానీ పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి ఆదర్శ పాఠశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. పాఠశాలలో సరిపడా మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కురిస్తే పాఠశాలకు సెలవు ఇవ్వాల్సిందే. పాఠశాల చుట్టూ వరద నీరు చేరి చెరువును తలపిస్తుంది. ఇదంతా ఎక్కడో కాదు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సోమారం ఆదర్శ పాఠశాల పరిస్థితి.

ముంపు ప్రాంతాల్లో పాఠశాల ఏర్పాటు

సైదాపూర్ మండలంలోని సోమారం ఆదర్శ పాఠశాలను మూడు వాగులు కలిసే కూడలి వద్ద ఏర్పాటు చేశారు. వర్షం వస్తే చాలు పాఠశాలకు జలగండం చుట్టుకుంటుంది. పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఇంటికి వెళ్లాలన్న ఇంటి నుంచి పాఠశాలలకు విద్యార్థులు రావాలన్న వరద నీరు రానివ్వకుండా ప్రవహిస్తోంది. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం మండలానికి ఆదర్శ పాఠశాలను మంజూరు చేసింది. అప్పుడు పక్క భవనం లేకపోవడంతో మండల కేంద్రంలోని వెన్కేపల్లి పాఠశాలలో బోధన చేపట్టారు. ఆ తర్వాత సోమారం గ్రామంలో భవన నిర్మాణం పూర్తి కావడంతో అప్పటి నుంచి సోమారంలోని పక్కా భవనంలో భోజనం చేపట్టారు.

సమస్యలు ఫుల్.. పరిష్కారం నిల్..

ఆదర్శ పాఠశాలలో సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. విద్యార్థులకు సరైన మరుగుదొడ్లు లేవు. ఆటస్థలం లేదు. పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో పాఠశాలలో క్రిమి కీటకాలు విష పురుగులు చొరబడుతున్నాయి. సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు సంఘాల నాయకులు పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

పాఠశాల భూములు అన్యాక్రాంతం

ప్రభుత్వం ఆదర్శ పాఠశాల కు కేటాయించిన భూమి అన్యాక్రాంతమవుతున్న అధికారులు పట్టించుకోకపోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. పాఠశాలకు కేటాయించిన భూమిలోనే తెలంగాణ క్రీడా ప్రాంగణం, డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసిన అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు.

ప్రహరీ నిర్మించాలని గతంలో ధర్నా..

ఆదర్శ పాఠశాల, బాలికల వసతి గృహం చుట్టూ ప్రహరీ నిర్మించాలని గతంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ప్రహరీ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.70 లక్షల నిధులు మంజూరు చేసింది. గుత్తేదారు ఆదర్శ పాఠశాల, బాలికల వసతి గృహం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి పునాదులు తీసి పుటింగ్ వేసి వదిలేశాడు.

ఇప్పుడు చేయకుంటే అప్పటికి తిప్పలే..

మరో 15 రోజుల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. కాగా పాఠశాల ప్రారంభం కాకముందే ప్రహరీ గోడ నిర్మాణం, విద్యార్థులకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహం చుట్టూ ప్రహరి గోడ ఇప్పుడు నిర్మించకపోతే అప్పటికి వర్షాలు పడితే తిప్పలే అవుతుందని పేర్కొంటున్నారు.

Similar News