కాయ్ రాజా కాయ్..! ఎన్నికల ఫలితాలపై సర్వత్రా టెన్షన్.. టెన్షన్

ఓటర్ల తీర్పు బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. జూన్ 4న అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానున్నది.

Update: 2024-05-19 02:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఓటర్ల తీర్పు బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. జూన్ 4న అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానున్నది. విజయం ఎవరిని వరిస్తుందనే సర్వత్రా చర్చ సాగుతోంది. పోలింగ్‌ సరళిని బట్టి ఎవరికి వారు తమకు తోచింది చెబుతున్నారు. తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో విజయం ఏకపక్షమేనని ప్రచారం జరుగుతుండగా, మరికొన్ని నియోజకవర్గాలపై మాత్రం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. మరోవైపు గెలుపోటములపై బెట్టింగ్‌ జోరందుకుంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఎవరు గెలుస్తారు? ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయి? ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది? అనే అంశాలపై బెట్టింగ్‌ జరుగుతున్నది. రాష్ట్రంలో ఏ పార్టీ మెజార్టీ సాధిస్తుందనే దానిపైనా పందేలు నడుస్తున్నాయి. కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామస్థాయిలోనూ బెట్టింగ్ దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తున్నది.

బీఆర్ఎస్‌పై పెడితే త్రిబుల్..

హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, చేవెళ్ల, మహబూబాబాద్‌లో విజయం సాధిస్తుందని బెట్టింగ్ జరుగుతున్నది. బీజేపీ కరీంనగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, నిజామాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, జహీరాబాద్, భువనగిరిలో విజయంపై బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ మెదక్, సికింద్రాబాద్, చేవెళ్ల, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి నియోజకవర్గాలపై బెట్టింగ్ చేస్తుండగా, ఎక్కువగా మెదక్, చేవెళ్లపైనే పందేలు కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు.. కాంగ్రెస్, బీజేపీపై పెడితే లక్షకు లక్ష.. అదే బీఆర్ఎస్‌పై లక్ష పెడితే డబుల్, త్రిబుల్ ఇస్తామంటూ బెట్టింగ్ నడిపిస్తున్నారని సమాచారం. రూ.50 వేల నుంచి ఆ పైగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.

బీఆర్ఎస్ నేతల్లో కనిపించని క్లారిటీ

గతంలో బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని సెగ్మెంట్ల పేరుతో సహా చెప్పేవారు. ఓట్ల మెజార్టీపైనా క్లారిటీ ఇచ్చేవారు. అది ఇప్పుడు రివర్స్ అయింది. బీఆర్ఎస్‌పై చర్చించకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నింటిలో విజయం సాధిస్తాయనే విషయాన్ని చెబుతుండటం గమనార్హం. పార్టీ ఓట్లు డైవర్ట్ అయ్యాయని ప్రచారం నేపథ్యంలో నేతలు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఎన్ని స్థానాల్లో గెలుస్తామనే ధీమాను సైతం వ్యక్తం చేయడం లేదు. పార్టీ అధిష్టానం మాత్రమే రెండు జాతీయ పార్టీలకంటే ఎక్కువ సీట్లు వస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తోంది తప్ప క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు.

ఏపీ ఎన్నికలపైనా ఆసక్తి..

మరోవైపు.. ఏపీ రాజకీయాలపైనా జోరుగా పందేలు నడుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఏపీ ప్రజలు ఎక్కువగా నివసిస్తుండటం, గతంలో లేని విధంగా ఈసారి ప్రత్యేక వాహనాలు అద్దెకు తీసుకొని పోయి మరీ ఓటు వేయడం గెలుపోటములపై ఈసారి మరింత ఆసక్తి పెరిగింది. విశాఖ ఉత్తరం, పశ్చిమ, మాడుగుల, పెందుర్తి వంటి నియోజకవర్గాలపై ఎక్కువ పందేలు సాగుతున్నట్లు సమాచారం. అదేవిధంగా భీమిలి, గాజువాక, విశాఖ ‘సౌత్‌’ వంటి నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు వచ్చే మెజారిటీపై బెట్టింగ్‌ కడుతున్నారని సమాచారం. మరోవైపు ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై మాత్రం 2:1 నిష్పత్తిలో బెట్టింగ్‌ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కూటమికి, వైసీపీకి వచ్చే ఎంపీ స్థానాలపై కూడా పందేలు కొనసాగుతున్నాయి. మళ్లీ జగన్ ఎక్కువ సీట్లలో గెలుస్తారని కేటీఆర్ పేర్కొనడంతో.. ఎక్కువ మంది వైసీపీ గెలుపుపై పందేలు కాస్తున్నారని సమాచారం.

Similar News