జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ..!

ఆవిర్భావ వేడుకలు (జూన్ 2) నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని మూడు రోజల క్రితం ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది.

Update: 2024-05-24 02:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు (జూన్ 2) నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని మూడు రోజల క్రితం ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. కానీ ఇంతవరకు అక్కడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అధికారుల్లో టెన్షన్ పట్టుకున్నది. ఆవిర్భావ వేడుకలపై ఈసీ ఆలోచన ఎలా ఉందోనని ఆరా తీస్తున్నారు. వేడుకలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేక షరతులతో కూడిన అనుమతి ఇస్తుందా? అని ఈసీ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇటీవల కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో మంత్రివర్గ సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ నుంచి క్లియరెన్స్ తీసుకుని, ఏర్పాట్లు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది.

ఈసీ అనుమతి కోసం ఎదురుచూపులు

దేశ వ్యాప్తంగా ఏడు దఫాలుగా జరుగుతున్న లోకసభ పోలింగ్ జూన్ 1తో ముగియనుంది. దీంతో ఎన్నికల కోడ్‌కు ఇబ్బంది ఉండదని, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. కానీ ఈసీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొన్నది. చివరి నిమిషంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే వేడుకల ఏర్పాట్లకు ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా అనుమతి ఇస్తే పరేడ్ గ్రౌండ్‌లో భారీ స్థాయిలో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

వేడుకల నిర్వహణపై రేవంత్ కసరత్తు

ఈసారి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వినూత్నంగా నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు. అందులో భాగంగా ఆయన తన ఇంట్లో తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, నిపుణులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పోరాటం వల్లే రాష్ట్రం ఏర్పాటైందన్న తీరుగా ఆవిర్భావ వేడుకలు జరిగాయని, ఇప్పట్నించి అందుకు భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన అన్ని వర్గాలకు ప్రయారిటీ ఇచ్చేలా వేడుకలను డిజైన్ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ లీడర్ వెల్లడించారు. కాంగ్రెస్ ఇవ్వడం వల్లే రాష్ట్రం ఏర్పాటైందన్న సందేశం భవిష్యత్ తరాలకు చేరేలా వేడుకలు ఉంటాయని వివరించారు.

త్వరలో ఢిల్లీకి రేవంత్

చివరి విడుతలో ఢిల్లీ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఎన్నికల ప్రచారం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అంతకంటే ముందే సోనియా గాంధీని కలిసి తెలం గాణ ఆవిర్భావ వేడుకలకు ప్రత్యేక అతిథిగా రావాలని ఆహ్వానించనున్నట్టు తెలిసింది. ఆమె వచ్చేందుకు అంగీకరిస్తే పరేడ్ గ్రౌండ్‌లో సుమారు 30 వేల మందితో బహిరంగ సభ నిర్వహించాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ఆ వేదిక నుంచే తెలంగాణ కోసం పోరాడిన వారిని సన్మానించనున్నారు.

Similar News