ఆ ఉమ్మడి జిల్లాలో జంపింగ్ పాలిటిక్స్... పార్టీలు మారుతున్న కీలక నేతలు

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉమ్మడి జిల్లాలో జంపింగ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి....

Update: 2024-05-01 03:57 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉమ్మడి జిల్లాలో జంపింగ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. సాధారణ కార్యకర్తలు మొదలుకొని నియోజకవర్గ, మండల కీలక నేతల దాకా పార్టీలు మారుతున్నారు. పార్టీలో ఉన్న వారిని కాపాడుకోవడంతో పాటు ఇతర పార్టీల నేతలకు గాలం వేయడం పార్టీ వీడిన వారిని మళ్లీ సొంతగూటికి తెచ్చుకోవడం లక్ష్యంగా పెట్టకున్నారు. ఈ వ్యవహారంలో పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ప్రత్యర్ధివర్గాన్ని మానసికంగా కుంగదీసేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇతర పార్టీల్లో అసంతృప్తులను తమ వైపు లాక్కునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు.

అధికారంలోకి రాగానే స్థానిక పదవుల్లో కొందరికి, రాష్ర్టస్థాయి పదువులు మరికొందరికి అవకాశం కల్పిస్తామని ఆశ చూపుతూ పార్టీలలోకి చేర్చుకుంటున్నారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంపింగ్‌లు ఎక్కవ కావడంతో ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది.


పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల్లో వేడి రాజుకుంటోంది. ఓ వైపు ప్రచారం సాగిస్తునే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. గెలుపు తీరాన్ని తాకేందుకు గాను తమకున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాయి రాజకీయ పార్టీలు. సిట్టింగ్ స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ రెండోసారి ఎంపీ కావాలని సర్వశక్తులను ఒడ్డుతున్నారు. దశాబ్ద కాలంగా దూరమైన ఎంపీ పదవిని తిరిగి తమ ఖాతాలో వేసుకోవాలని సీనియర్ నేత జీవన్ రెడ్డిని కాంగ్రెస్ బరిలో నిలిపింది. ఐదు సంవత్సరాల క్రితం ఎక్కడైతే పోగొట్టుకున్న ఎంపీ పదవిని అక్కడే దానిని దక్కించుకుని ప్రత్యర్థులకు ఓటమి రుచి చూపించాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్‌ను బరిలో దించింది. పార్టీ నామినేషన్లు వేసుకుని తమ అభ్యర్థిత్వాలను ఖాయం చేసుకున్న ప్రధాన పక్షాలు నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.


ఇప్పటికే ఒక దఫా ప్రచారాన్ని ముగించుకుని రెండవ దఫా ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా పార్టీ ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు తమ పార్టీలోకి లాగే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అందులో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో నిలిచింది. మంగళవారం నిజామాబాద్ నగరానికి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా సోమవారం బీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరు పొలిట్ బ్యూరో సభ్యుడిగా, జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన ఏ.ఎస్.పోశెట్టి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆదివారం ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా లక్కీ అద్యక్షుడిగా పేరు గాంచిన ఈగ గంగారెడ్డి కూడా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ కొత్త చేరికలను ప్రోత్సహిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఇదివరకే గడిచిన నెల సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొనగా మరోసారి మే 1న జరిగే కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొనున్నారు. తర్వాత ఆర్మూర్ లో నిర్వహించిన రోడ్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొనేలా ప్లాన్ చేశారు కాంగ్రెస్ నాయకులు. బీజేపీ పార్టీ ఇతర పార్టీల నుంచి నాయకులు చేర్చుకుని పనిలో బీజేపీగానే ఉంది. ప్రధానంగా తమ పార్టీ నుంచి గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, జడ్పీటీసీలను ఘర్ వాపస్ పేరిట వెనక్కి తీసుకునే పనిలో పడింది.

నిజామాబాద్ బల్ధియాలో పాటు పార్లమెంట్ పరిధిలోని బీజేపీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో త్వరలో బీజేపీ అగ్రనేత అమిత్ షా పర్యటన ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. గతేడాది డిసెంబర్ వరకు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోగానే ఆ పార్టీలోని నాయకులు ఇతర పార్టీల్లోకి క్యూ కట్టారు. ప్రధానంగా బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారు ఆ పార్టీ గూటికే చేరుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలను పరిగణలోకి తీసుకుని కొందరు నామినేటెడ్, కార్పొరేషన్ పేరిట పార్టీ మారుతున్నారు. దానితో బీఆర్ఎస్ నానాటికి కుదేలవుతుంది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు బీఆర్ఎస్‌కు రాంరాం చెప్పారు. మున్సిపల్ చైర్మన్లతో పాటు కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచ్‌లు పార్టీ మారిన వారిలో ఉన్నారు. వివిధ కార్పొరేషన్ పదవుల్లో ఉన్న వారు కూడా పార్టీ మారుతుండడంతో బీఆర్ఎస్ పార్టీకి ద్వితీయ శ్రేణి నాయకత్వ కొరత ఏర్పడింది. ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లేందుకు బహరంగ సభను, కార్నర్ మీటింగ్, ముఖ్య కార్యకర్తల సమావేశాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. బూత్ స్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసే లీడర్లు కరవవుతున్నారు.

ఇది పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద దెబ్బగా చెబుతున్నారు. మరోవైపు మజ్లీస్ పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. వారి మద్దతు ఉంటే ఆయా పార్టీలకు అదనపు బలమని చెప్పాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పతంగి ఆ పార్టీకే మొగ్గు చూపుతుందని జిల్లాలో చర్చ జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఎన్నికల వేళ ఆయారాం, గయారాంల జోరు జోరుగా ఉంది. పొద్దున్నే ఒక పార్టీలో ఉన్న నాయకులు సాయంత్రానికి కండువాలు మార్చేస్తున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి తమ వంతుగా నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని దానికి పార్లమెంట్ ఎన్నికలను వేదికగా చేసుకుని తమకున్న కుల, మత బలగాన్ని వెంటేసుకుని పార్టీలో మారే లీడర్లు రోజురోజుకు అన్నీ పార్టీలో ఎక్కువైపోయారు.


Similar News