ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే జాబ్ క్యాలెండర్: MLC బల్మూరి వెంకట్

ఎన్నికల కోడ్ ముగియగానే జీవో 46, 317 సమస్యలకు పరిష్కారం చూపుతామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు.

Update: 2024-05-25 14:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల కోడ్ ముగియగానే జీవో 46, 317 సమస్యలకు పరిష్కారం చూపుతామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. నిరుద్యోగుల ప్రతీ సమస్యను కాంగ్రెస్ పరిష్కరిస్తుందన్నారు. ఎవరు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. నిరుద్యోగులకు తప్పు దోవ పట్టించే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారని, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. పదేళ్లలో బీఆర్ఎస్ విద్యార్ధులు, నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ ఎన్నడూ విద్యార్ధులను కలవలేదన్నారు. టెక్నికల్ సమస్యలతోనే స్టాఫ్​నర్సుల జీతాలు ఆగాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవో 46 అంశంపై కేబినెట్ సబ్ కమిటిని ఏర్పాటు చేసిందన్నారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే జీవో 46, జీవో 317 సమస్యలను పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత జాబ్ కేలండర్ ప్రకటిస్తామన్నారు. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదని, ఉద్యోగ పత్రం ఇస్తేనే ఉద్యోగాలు ఇచ్చినట్లు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకున్నోళ్లను, పేపర్ లీకేజీలకు కారణమైనోళ్లను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలు ఇస్తామన్నారు. నియంత్రణ కమిటీ సూచించినట్టుగానే ప్రైవేట్ ఫీజులు ఉండేలాగా తాను ప్రత్యేక చొరవ తీసుకొని సీఎంకు లెటర్ ఇస్తానని తెలిపారు. సమ్మర్ క్లాస్‌లు నడుపుతున్నోళ్లపై చర్యలు తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. విద్యావ్యవస్థ, యూనివర్సిటీ సమస్యలపై తాను చర్చకు ఎక్కడికైనా వస్తానని వెల్లడించారు.

Similar News