‘కేఎల్‌’తో రెవెన్యూ కుమ్మక్కు..?

గాజులరామారంలోని ఇనాం భూములు కేఎల్ యూనివర్సిటీకి అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది...

Update: 2024-05-25 02:43 GMT
  • ఇనాం భూములు అప్పగించేందుకు రంగం సిద్ధం
  • ఆర్డీవో ఆఫీసులో భూముల రిజిష్టర్లు మాయం..?
  • వివరాలు కోరితే లేవంటున్న అధికారులు

దిశ, మేడ్చల్ బ్యూరో: గాజులరామారంలోని ఇనాం భూములు కేఎల్ యూనివర్సిటీకి అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇనాం భూములకు సంబంధించిన వివరాలు కోరితే తమ వద్ద లేవంటూ రెవెన్యూ అధికారులు చెప్పడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇప్పటికే భూముల వ్యవహారంలో కేఎల్ యూనివర్సిటీపై చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. ఓఆర్‌సీ (ఆక్యుపేషనల్ రైట్స్ సర్టిఫికెట్) ఇవ్వకుండానే ఇనాం భూముల కొనుగోలుతోపాటు వాటిని మ్యుటేషన్ చేయించుకోవడం వెలుగుచూసింది. ఈ వ్యవహారంపై కలెక్టర్ కార్యాలయంలో కేసులు సైతం నడుస్తున్నాయి. తాజాగా రెవెన్యూ అధికారుల వైఖరి యాజమాన్యానికి అనుకూలంగా ఉండడంతో కుమ్మక్కు అయ్యారా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రిజిస్టర్లు ఎలా మాయమైనట్లు..?

గాజులరామారంలో సర్వేనంబర్ 429, 430, 431, 432, 433, 439, 441, 442, 380 సబ్ డివిజన్లలో ఇనాం భూములు ఉన్నాయి. వాటిని కేఎల్ యూనివర్సిటీ ఓఆర్‌సీ లేకుండానే కొనుగోలు చేసింది. 11 ఎకరాలకు పైగా ఇనాం భూములుగా ఉండగా అసలైన వారసులకు ఓఆర్‌సీని అందించకుండానే యాజమాన్యం లావాదేవీలు కొనసాగించింది. ఈ వ్యవహారంపై బాధితులు ఇప్పటికే జిల్లా కలెక్టరేట్‌ను ఆశ్రయించారు. సర్వేనంబర్ 380, 429 నుంచి 433, 441, 442లకు సంబంధించి ఓఆర్‌సీ రిజిస్టర్, డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ కాపీలను ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా.. ఆ రికార్డులు అందుబాటులో లేవంటూ ఆర్డీవో కార్యాలయ అధికారులు సమాధానం ఇచ్చారు. పాత రికార్డులే కాకుండా 2022, 2023, 2024లో జారీచేసిన ఓఆర్‌సీ, డిస్ట్రిబ్యూషన్ రికార్డులు సైతం అందుబాటులో లేవంటూ చెప్పడం గమనార్హం.

Similar News