అర్ధరాత్రి పట్టపగలే.. ఓల్డ్ సిటీలో రంజాన్ షాపింగ్ సందడి

మహానగరంలో శుక్రవారం రంజాన్ సందడి కన్పించింది.

Update: 2023-04-22 01:44 GMT

దిశ, సిటీబ్యూరో : మహానగరంలో శుక్రవారం రంజాన్ సందడి కన్పించింది. శనివారమే రంజాన్ పండుగ అన్న విషయం ఖరారైన నేపథ్యంలో ఈసారి పండుగను మరింత ఘనంగా నిర్వహించుకునేందుకు ముస్లింలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత మూడేళ్ల పాటు సరిగ్గా రంజాన్ జరుపుకోని ముస్లింలు ఈసారి ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రంజాన్ దీక్షలు ప్రారంభమైన ఈ నెల 24 నుంచి కేవలం సాయంత్రం ఇఫ్తార్ సమయంలోనే గంటరన్న నుంచి రెండు గంటల పాటు మార్కెట్లు సందడిగా కనిపించేవి.

కానీ గడిచిన నాలుగైదు రోజులుగా ఎక్కడచూసిన రంజాన్ సందడే. ముఖ్యంగా రంజాన్ షాపింగ్ కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు పాతబస్తీకే వస్తుండటంతో మదీనా నుంచి లాల్‌దర్వాజ వరకు ఎక్కడ చూసినే జనసందోహంగా మారింది. సాంప్రదాయ దుస్తులన్నీ లభించే పాతబస్తీలోనే షాపింగ్ చేసేందుకు ముస్లింలు ఉత్సాహాన్ని చూపారు. బట్టలు, నగలు, సుగంధద్రవ్యాలతో పాటు పలు హోటళ్లు సైతం బిర్యానీ, హలీంలపై ఫెస్టివల్ ఆఫర్లు ప్రకటించాయి.

శుక్రవారం ఇఫ్తార్ ముగిసిన తర్వాత లక్షలాది మంది పాతబస్తీలో షాపింగ్ చేస్తూ కనిపించారు. పాతబస్తీలోని దాదాపు అన్ని రకాల చిన్నాచితక షాపులు సైతం రంజాన్ ఆఫర్లను ప్రకటించి, కొనుగోలుదారులను ఆకర్షించుకున్నాయి. శుక్రవారం దాదాపు పాతబస్తీలోని అన్ని షాపులు తెల్లవారుఝము వరకు తెరిచే ఉన్నాయి. షాపుల విద్యుత్ కాంతులతో పాతబస్తీ దగదగ మెరిసింది. రంజాన్ షాపింగ్ సందర్భంగా పాతబస్తీలోని పలు రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేశారు.

పాతబస్తీలోని దాదాపు అన్ని షాపుల్లోని స్టాఫ్‌కు యజమానులు రంజాన్ షాపింగ్‌కు ప్రత్యేక అలవెన్స్‌లు ప్రకటించి, అర్థరాత్రి వరకు వ్యాపారం నిర్వహించగా, గడిచిన మూడు రోజులుగా అర్థరాత్రి రెండు, మూడు గంటల వరకు షాపింగ్ కొనసాగగా, శుక్రవారం షాపింగ్‌కు వచ్చిన కొనుగోలుదారుల సంఖ్యను బట్టి శనివారం తెల్లవారుఝాము వరకు షాపింగ్ కొనసాగే అవకాశాలున్నాయి.

ప్రశాంతగా సామూహిక ప్రార్థనలు

పాతబస్తీ చార్మినార్ సమీపంలోని మక్కామసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం చివరి శుక్రవారం సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా జరిగాయి. ఫ్రైడే కావటంతో ఒకవైపు చార్మినార్‌లో కొలువుదీరిన శ్రీభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముండటంతో శాంతిభద్రతల పరిరక్షణకు ముందు జాగ్రత్తగా చార్మినార్ వద్ద ప్రత్యేక బలగాలతో బందోబస్తు నిర్వహించాయి.

Tags:    

Similar News