‘నో’ పర్మిషన్స్.. అయినా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వెంచర్లు

జిల్లాలో అనుమతి లేని వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

Update: 2024-05-24 02:05 GMT

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో: జిల్లాలో అనుమతి లేని వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి అమాయకులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వాటిని కొనుగోలు చేసిన ప్రజలు రిజిస్ట్రేష‌న్‌ ఇంటి నిర్మాణ అనుమతులు, బ్యాంకు లోన్‌ పొందే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డీటీసీపీ, రెరా అనుమతులు లేకుండా...

వ్యవసాయ భూములను ప్లాట్లుగా విక్రయించాలంటే నాలా కన్వర్షన్‌ ద్వారా ఆర్డీవో నుంచి ఉత్తర్వులు పొందాల్సి ఉంటుంది. అనంతరం డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ నుంచి అనుమతి పొందాలి. డీటీసీపీ అనుమతి కోసం నీటి పారుదల, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల నుంచి ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. వెంచర్‌లో పది శాతం స్ధానిక సంస్థలకు రిజిస్ట్రేషన్‌ చేయాలి. వెంచర్‌కు అప్రోచ్‌ రోడ్లు 60 ఫీట్లు, లోపల 40 ఫీట్ల రోడ్లు, 33 ఫీట్ల వెడల్పు రోడ్లు ఏర్పాటు చేయాలి. పాఠశాల, పార్కు, గుడి, కమ్యూనిటీ హాలు, హెల్త్‌ సెంటర్‌, ఓవర్‌ హెడ్‌ ట్యాంకు అవసరాలకు స్థలం కేటాయించాలి. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్‌లైన్లు వంటి అభివృద్ధి పనులు, రియల్‌ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండానే ఇరుకు రోడ్లతో వెంచర్లు వెలుస్తున్నాయి.

ప్ర‌భుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి..

రియల్టర్లు ప్రభుత్వానికి ఫీజులు, అనుమతుల రూపంలో వచ్చే ఆదాయానికి గండి కొడుతూ నిబంధనలు పాటించకుండా ప్లాట్లను విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు. వాటిని కొనుగోలు చేసిన ప్రజలు క్రమబద్దీకరణ, ఇంటి నిర్మాణానికి అనుమతులకు ఫీజులు, పెనాల్టీలు చెల్లించాల్సి వ‌స్తోంది. మంచిర్యాల జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న న‌స్పూరులో వెంచర్లు ఏర్పాటు చేస్తూ రియల్టర్లు అమాయకులను మోసం చేస్తున్నారు. వెంచర్‌కు డీటీసీపీ, రెరా అనుమతులున్నాయంటూ, తక్కువ రేటు అంటూ కొనుగోలుదారులకు ప్లాట్లు అంటగడుతున్నారు. ఈ అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొన్న సామాన్యులు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. అధికారుల కళ్ల ముందే అక్రమాలు జరుగుతున్నా వారు చేష్టలుడిగి చూస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అనుమ‌తులు లేవు... అంతా మా ఇష్టం..

ఇక ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు త‌మ వంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే, వారే నేరుగా వెంచ‌ర్లు వేయ‌డం లేదంటే ప‌ర్సంటేజీలు తీసుకుని అందులో భాగస్వామ్యం తీసుకుంటున్నారు. దీంతో అధికారులు అటువైపు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి నెల‌కొంది.

- స‌ర్వే నంబ‌ర్ 2, 13లో నాలుగు ఎక‌రాల మేర అక్ర‌మంగా వెంచ‌ర్ ఏర్పాటు చేశారు. డీటీసీపీ అనుమ‌తులు లేకుండా వెంచర్ చేశారు. ఇటీవ‌లే బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరిన నాయ‌కుడు ఈ వెంచ‌ర్ ఏర్పాటు చేసి రోడ్డు వేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఇందులో ప్లాట్లు సైతం అమ్మ‌కానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో వీటిని కొనేవాళ్లు మోస‌పోవ‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు చెబుతున్నారు.

- స‌ర్వే నంబ‌ర్ 11లో న‌స్పూరు ప‌ట్ట‌ణానికి చెందిన ఓ స్క్రాప్ వ్యాపారి వెంచ‌ర్ ఏర్పాటు చేశారు. రెండెక‌రాల ఎనిమిది గుంట‌ల భూమిని ప్లాంటింగ్ చేసి అమ్మ‌కాలు కొన‌సాగుతున్నాయి. ఇది కూడా డీటీసీపీ అనుమ‌తులు లేకుండానే కొన‌సాగుతోంది.

- స‌ర్వే నంబ‌ర్ 21లో నాలుగు ఎక‌రాల తొమ్మిది గుంట‌ల భూమిని చ‌దును చేసి మరీ ప్లాంటింగ్ చేశారు. న‌స్పూర్ ప‌ట్ట‌ణానికి చెందిన టెంట్ హౌజ్ వ్యాపారి ప్లాటింగ్ చేసి అమ్మాడు. ఇది కూడా అక్ర‌మ లే అవుట్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో లాండ్ క‌న్వ‌ర్ష‌న్‌ కానీ, డీటీసీపీ అనుతులు కానీ లేవు. ఎవ‌రైనా అధికారి అక్క‌డికి వెళితే వారిని బెదిరింపుల‌కు గురిచేయ‌డ‌మో, లేక‌పోతే చేతులు త‌డిపి వెన‌క్కి పంప‌డ‌మో చేస్తున్నారు.

- ఈ అక్ర‌మాలు ఎక్క‌డో మారుమూల ప్రాంతంలో జ‌రుగుతున్నాయనుకుంటే పొర‌పాటే. సాక్షాత్తు క‌లెక్ట‌రేట్‌ను ఆనుకుని ఉన్న స‌ర్వే నంబ‌ర్ 32లో ఎనిమిది ఎక‌రాల తొమ్మిది గుంట‌ల భూమిని ఎటువంటి అనుమ‌తులు లేకుండా ప్లాట్లు చేసి ద‌ర్జాగా అమ్ముతున్నారు.

- స‌ర్వే నంబ‌ర్ 46లో బీఆర్ఎస్‌, బీజేపీకి చెందిన నేత‌లు ఇద్ద‌రూ క‌లిసి వెంచ‌ర్ ఏర్పాటు చేశారు. ఒక ఎక‌రం 38 గుంట‌ల్లో ఈ వెంచ‌ర్ ఏర్పాటు చేయ‌గా, టీపీవో దానిపై దృష్టి సారించారు. అయితే, ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ, అధికారులు ఆ విష‌యంలో సైలెంట్ అయ్యారు.

- స‌ర్వే నంబ‌ర్ 51లో మంచిర్యాలలోని ప్ర‌ముఖ వ్యాపారి ప్లాటింగ్ చేసి అమ్మ‌కానికి సిద్ధంగా ఉంచారు. కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు ఇందులో డ‌బ్బులు తీసుకుని అక్క‌డికి అధికారులు రాకుండా, వారు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా అడ్డ‌కుంటున్నారు.

- స‌ర్వే నంబ‌ర్ 113లో రెండెక‌రాల భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయ‌కుడు వెంచ‌ర్ చేశారు. దీనికి సైతం ఎలాంటి అనుమ‌తులు లేవు. అయినా, దానిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు అధికారులు ముందుకు రావ‌డం లేదు.

Similar News