ప్రభుత్వ ఆస్పత్రిలో పార్కింగ్ దందా..పేదలను పట్టిపీడిస్తున్న అక్రమార్కులు

ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోలేని పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుంటారు.

Update: 2024-05-25 02:15 GMT

దిశ,హైదరాబాద్ బ్యూరో:ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోలేని పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుంటారు. అయితే వారిని పట్టిపీడించేలా సర్కార్ ఆసుపత్రిలో పార్కింగ్ పేరుతో అందినకాడికి డబ్బులు గుంజుకుంటున్నా అడిగే నాథుడు లేకుండా పోయాడు. చారిత్రక గోల్కొండ ఏరియా ఆస్పత్రిలో కొందరు అక్రమార్కులు ఆస్పత్రి ఎంట్రీ గేట్ వద్ద తిష్ట వేశారు. రోజు ఆసుపత్రికి వచ్చే నిరుపేదల నుంచి పార్కింగ్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు రూ.20 చొప్పున వసూలు చేస్తూ పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారు.

లక్షల్లో అక్రమార్జన..?

గోల్కొండలోని ఏరియా ఆస్పత్రికి రోజు సుమారు రూ.100 నుంచి రూ.200 మంది ఔట్ పేషెంట్లు వస్తుంటారు. ఈవిధంగా ఇన్ పేషెంట్‌లో ఉన్న రోగులను పరామర్శించేందుకు వారి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా వస్తుంటారు. ఈ నేపథ్యంలో సదరు వాహనదారుల నుంచి పార్కింగ్ పేరిట అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు రూ.20 చొప్పున తీసుకుంటున్నారు. ఈ లెక్కన నెలకు సుమారు రూ.లక్షకు పైగా వసూలు చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు లేకపోవడంతోనే ప్రభుత్వాసుపత్రికి వస్తున్నామని, తమ వద్ద నుంచి పార్కింగ్ పేరుతో డబ్బులు వసూలు చేయడం ఏంటని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం..

అజయ్ కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్..గోల్కొండ ఏరియా ఆస్పత్రిలో వాహనాల పార్కింగ్ కోసం డబ్బులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఈ విషయంలో వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాం. పేద రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఊరుకునేది లేదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Similar News