తెలంగాణ రాష్ట్రానికి ప్రధానిగా మోడీ చేసింది శూన్యం

కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేసింది శూన్యమని, టాక్స్ ల రూపంగా తెలంగాణ రాష్ట్రం నుండి కోట్లాది రూపాయలు కేంద్రానికి పంపితే ప్రధాని ఆ నిధులతో గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-04-30 16:37 GMT

దిశ, ఎల్బీనగర్ : కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేసింది శూన్యమని, టాక్స్ ల రూపంగా తెలంగాణ రాష్ట్రం నుండి కోట్లాది రూపాయలు కేంద్రానికి పంపితే ప్రధాని ఆ నిధులతో గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఎన్టీఆర్ నగర్ చౌరస్తాలో రాత్రి ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉండగా ఒక్క గుజరాత్ కి ప్రాముఖ్యత ఇస్తూ ఇతర రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను లూఠీ చేసి ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు.

    కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, అందులో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం, 30 రోజుల్లో 30 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ కు దక్కిందన్నారు. ఎన్టీఆర్ నగర్ లోని ఇండ్ల రెగ్యులేషన్ సమస్యను పార్లమెంట్ ఎన్నిక తర్వాత పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, దీప భాస్కర్ రెడ్డి, లక్ష్మారెడ్డి ఉపేందర్ రెడ్డి సరూర్నగర్ ఆర్కే పురం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


Similar News