ముంచుకొస్తున్న ముప్పు.. నగరవాసులకు తప్పని వానకాలం కష్టాలు

విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్ మహానగరం వానాకాలం వచ్చిందంటే చాలు చిగురుటాకులా వణికిపోతుంది.

Update: 2024-05-27 02:07 GMT

దిశ, సిటీ బ్యూరో: విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్ మహానగరం వానాకాలం వచ్చిందంటే చాలు చిగురుటాకులా వణికిపోతుంది. ఈసారి జూన్ 5 కల్లా నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశమున్నట్లు, హైదరాబాద్ నగరంలో కాస్త ముందుగానే భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించటంతో ఒక రకంగా నగరానికి వరద ముప్పు ముంచుకొస్తుందనే చెప్పవచ్చు. జీహెచ్ఎంసీ అధికారులు భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు, రోడ్లపై భారీగా నిలుస్తున్న వర్షపు నీటిని సకాలంలో తొలగించలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గరిష్టంగా గంట సమయంలో సుమారు 7 సెం.మీ.ల వర్షపాతానికే తట్టుకునేలా నగరంలోని వరద నీటి కాలువలను నిజాం కాలంలో ఏర్పాటు చేశారు.

కానీ వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా నగరంలో ఒక్కోసారి కనిష్టంగా పది, గరిష్టంగా 20 సెం.మీ.ల వరకు వర్షపాతం నమోదైన సందర్భాలున్నాయి. ఇటీవల కొద్ది రోజుల క్రితం దంచికొట్టిన భారీ వర్షానికి నగరం అతలాకుతలం కావటంతో పాటు నగరంలోని దాదాపు సగం కన్నా ఎక్కువ ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు కరెంటు సరఫరా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని ప్రవేశించేందుకు గడువు ఇంకా పది రోజులు కూడా లేదు. మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలకు సంబంధించిన టెండర్లను సైతం ఖరారు చేయకపోవటం జీహెచ్ఎంసీ అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ టెండర్ల ప్రక్రియలో ఇంజినీర్లు పనుల కేటాయింపుల్లో తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు పలు ఘటనలు వెలుగులోకి రావటంతో ఈ ప్రక్రియ ముగించేందుకు ఆలస్యమవుతున్నట్లు సమాచారం.

పూర్తికాని నాలాల్లోని పూడికతీత పనులు..

ఆరు జోన్లు, 30 సర్కిళ్లకు విస్తరించిన ఉన్న హైదరాబాద్ మహానగరంలో చిన్న, మధ్య, భారీ తరహా నాలాలు దాదాపు వెయ్యి కిలోమీటర్ల పైచిలుకు ప్రవహిస్తున్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందే అన్ని నాలాల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని కిర్లోస్కర్ కమిటీ సిఫార్సు చేసినా, ఇప్పటి వరకు ఏ సంవత్సరం పూడికతీత పనులను వర్షాకాలానికి ముందు వంద శాంత పూర్తి చేసిన దాఖల్లాల్లేవు. ఈ సంవత్సరం కూడా సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పుకుంటున్న జీహెచ్ఎంసీ అధికారులు వాటి వివరాలు గోప్యంగా ఉంచటానికి కారణాలేమిటీ అంటూ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. 2022 నుంచి వరదలు, ముంపు నివారణకు చర్యల్లో భాగంగా రూ.వెయ్యి కోట్లతో ఎస్ఎన్‌డీపీని గత సర్కారు తెరపైకి తెచ్చి మొత్తం 36 ముంపు నివారణ పనులను ప్రారంభించగా, వాటిలో ఇప్పటి వరకు సగం పనులు కూడా పూర్తికాకపోవటం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనం.

మేయర్ డివిజన్‌లోనే నాసిరకం పనులు..

మేయర్ విజయలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న బంజారాహిల్స్ డివిజన్‌ ఉదయ్ నగర్‌లో నాలాలపై నిర్మించిన స్లాబ్ ఒక్క వర్షానికే కొట్టుకుపోయిందంటే గత సర్కారు చేపట్టిన ఎస్ఎన్‌డీపీ పనుల్లో నాణ్యతను అంచనా వేయవచ్చు. ఎస్ఎన్‌డీపీ కింద పనుల కేటాయింపుల మాట అలా ఉంచితే కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్ఎన్‌డీపీ వింగ్ కార్యాలయం, అందులో ఇంజినీర్ ఇన్ చీఫ్ నియామకం వంటి వాటికిచ్చిన ప్రాధాన్యత పనుల కేటాయింపు, క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన వంటి అంశాలకు ఇవ్వకపోవటం వల్లే నాసిరకం పనులకు రూ.వెయ్యి కోట్లు వృథాగా వెచ్చించారన్న విమర్శలు వెల్లువెత్తుతుండగా, కేవలం గత సర్కారు హయాంలో పురపాలక శాఖలో కీలక పదవుల్లో కొనసాగిన పలువురు అధికారులు, రాజకీయ నేతల కమీషన్ల కోసమే నిధులు కేటాయించారే తప్పా, ముంపు నివారణ పనుల కోసం కాదంటూ మహానగరవాసులు మండిపడుతున్నారు.

మునిగి 23 ఏళ్లయినా.. గుణపాఠం నేర్వలే..

23 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తి, చాలా మంది ప్రాణాలు కోల్పోయినా ఇప్పటి వరకు అధికారులు, పాలకులు ముంపు నివారణ చర్యలకు సంబంధించిన గుణపాఠం నేర్వలేదంటూ సిటిజనులు విమర్శిస్తున్నారు. సమైక్యాంద్ర, ప్రత్యేక తెలంగాణల్లో సైతం పాలకులు, రాజకీయ నాయకులు తమ సొంత ప్రయోజనాలకిచ్చే ప్రాధాన్యత ప్రజాసమస్యల పరిష్కారానికి ఇవ్వటం లేదన్న విషయం తేలిపోయింది. కనీసం ప్రతి సంవత్సరం కిర్లోస్కర్ కమిటీ సిఫార్సులు కూడా అమలు చేసేందుకు చొరవచూపకపొవటం శోచనీయం. హైదరాబాద్ నగరం వరదలకు గురై నేటికీ 23 ఏళ్లు గడుస్తున్నా, కేవలం ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం)ను కోట్ల రూపాయలు వెచ్చించి పటిష్టపరిచారు. కానీ ఈ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కూడా కనీసం రోడ్లపై నిలిచిన నీటిని సకాలంలో తోడేయలేకపోవటం గమనార్హం.

Similar News