రోహిత్ వేములది ఆత్మహత్య కాదు హత్యనే

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ( హెచ్ సీయూ) విద్యార్థి రోహిత్ వేములది ఆత్మహత్యనేని ఎవరి ఒత్తిడి లేదంటూ పోలీసులు శుక్రవారం పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు.

Update: 2024-05-03 15:41 GMT

దిశ, శేరిలింగంపల్లి : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ( హెచ్ సీయూ) విద్యార్థి రోహిత్ వేములది ఆత్మహత్యనేని ఎవరి ఒత్తిడి లేదంటూ పోలీసులు శుక్రవారం పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా రోహిత్ ఆత్మహత్యకు కారణాలు, ఎవిడెన్స్ లేవని, కేసును మూసివేస్తున్నామని పోలీసులు కోర్టుకు రిపోర్టు ఇచ్చారు. రోహిత్ ఆత్మహత్యకు అప్పటి వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. యూనివర్సిటీ నిబంధనలకు లోబడే వైస్ ఛాన్సలర్ చర్యలు తీసుకున్నారని రిపోర్టులో పేర్కొన్నారు. అంతేగాకుండా రోహిత్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు.

తన కులానికి సంబంధించిన విషయంలోనే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు పోలీసులు. అయితే దీనిపై హెచ్ సీయూలోని పలు విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హెచ్ సీయూ మేన్ గేట్ వద్ద బీజేపీ నాయకులకు, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అక్కడ భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోహిత్ వేముల సంస్థాగత హత్య జరిగి ఎనిమిదేళ్లకు పైగా న్యాయం కోసం దేశవ్యాప్త ఉద్యమం కొనసాగుతోందని, రోహిత్ మృతిపై పోలీసులు కోర్టుకు సమర్పించిన రిపోర్ట్ తమకు తీవ్ర దిగ్భ్రాంతిని, నిరుత్సాహాన్ని కలిగించిందని, 13 విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పటి వైస్ ఛాన్సలర్ పొదిలె అప్పారావును పూర్తిగా తప్పించారని, అలాగే అప్పటి బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, ఎన్. రామచంద్రరావు, ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్‌ లు రోహిత్ వేముల హత్యకు కారణమని వారు ఆరోపించారు. రోహిత్ వేముల కేసును తిరిగి ఓపెన్ చేసి సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో హెచ్ సీయూ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.


Similar News