దివ్యాంగులకు అండగా మోదీ ప్రభుత్వం : కిషన్ రెడ్డి

దివ్యాంగులకు అండగా మోదీ ప్రభుత్వం నిలిచిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి తెలిపారు.

Update: 2024-04-29 14:29 GMT

దిశ, అంబర్ పేట: దివ్యాంగులకు అండగా మోదీ ప్రభుత్వం నిలిచిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి తెలిపారు. బిజెపి పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బర్కత్ పుర లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలిచి దివ్యాంగుల హక్కుల చట్టం 2016 తీసుకొచ్చి వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిందన్నారు.

దివ్యాంగుల రిజర్వేషన్ మూడు శాతం నుంచి నాలుగు శాతం ఉద్యోగ రిజర్వేషన్లు పెంచి వారికి అండగా నిలిచామని తెలిపారు. దివ్యాంగులను ఎవరైనా కించపరిచిన అవమానపరిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చట్టంలో పొందుపరిచి వాళ్ళకు అండగా నిలిచిన ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా దివ్యాంగులకు 4000 నుంచి 6000 పెన్షన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో సుమారుగా 5000 మందికి పదివేల కోట్లు ఖర్చుపెట్టి సహాయ పరికరాలను అందజేసిన ఘనత కిషన్ రెడ్డి దేనని తెలిపారు. రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈసారి మోదీని, కిషన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని, దివ్యాంగులను వారి కుటుంబాలను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చింతల రామచంద్ర రెడ్డి, కావ్య కిషన్ రెడ్డి, వికలాంగుల నాయకులు మహంకాళి రవీందర్, పులిపాటి శ్రీనివాసు, దయామని, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News