ఉదయం 5.30‌కే మాక్ పోలింగ్.. ఒక రోజు ముందే డీఆర్సీకి రావాలి

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లే కీలకం కానున్నారు.

Update: 2024-05-02 02:14 GMT

దిశ, సిటీ బ్యూరో: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లే కీలకం కానున్నారు. ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరిగేందుకు జిల్లా ఎన్నికల అధికారి వేల సంఖ్యలో సిబ్బందిని నియమించినప్పటికీ నిరంతరంగా 48 గంటల పాటు కంటిన్యూగా వీరు విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈనెల 13న పోలింగ్ జరిగే రోజు ఉదయం 5.30 కల్లా మాక్ పోలింగ్‌ను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలింగ్ స్టేషన్ల వారీగా నియమితులైన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, సెక్టోరియల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పోలింగ్‌కు ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్ల నుంచి ఈవీఎంలు, వీవీ ప్యాడ్‌లు, బ్యాలెట్ యూనిట్లను తీసుకునే సమయంలో వాటిని ఒకటికి రెండు సార్లు చెక్ చేయించుకోవాలని సూచించారు.

ఒక్కసారి ఎన్నికల సామాగ్రిని స్వీకరించిన తర్వాత ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు అక్కడి నుంచి రూట్ బస్సులో నేరుగా పోలింగ్ స్టేషన్‌కు చేరుకోవాలని సూచించారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు పోలింగ్ స్టేషన్ తాము నివాసముంటున్న ప్రాంతానికి దగ్గరలో ఉన్నట్లయితే పోలింగ్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ఎన్నికల సామాగ్రిని పోలింగ్ బూత్ వద్ద విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో పోలింగ్ స్టేషన్ గదుల్లో భద్రపర్చిన తర్వాత తమ నివాసానికి వెళ్లి, తిరిగి ఉదయం 5 గంటలకే పోలింగ్ స్టేషన్‌కు రావల్సి ఉంటుందని సూచించినట్లు సమాచారం. ఇక నివాసముంటున్న ప్రాంతానికి పోలింగ్ స్టేషన్ దూరం ఉన్నట్లయితే అక్కడే బస చేసి ఉదయం అయిదున్నర గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించినట్లు సమాచారం. వివిధ పార్టీల నియమించుకునే పోలింగ్ ఏజెంట్లు కూడా పోలింగ్ రోజు ఉదయం 5 గంటల లోపు చేరుకునేలా రిటర్నింగ్ ఆఫీసర్లు ఆదేశాలివ్వాలని సూచించారు.

వారి సమక్షంలో ఈవీఎంలు, వీవీ ప్యాడ్‌లు, బ్యాలెట్ యూనియన్లను తెరిచి, అందులో ఎలాంటి ఓట్లు లేనట్టు చూపించాలని సూచించినట్లు తెలిసింది. మాక్ పోలింగ్ నిర్వహించినానంతరం మళ్లీ ఓట్ల సంఖ్యను జీరో చేసి ఉదయం 7 గంటల నుంచి సాధారణ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారం మొత్తాన్ని మైక్రో అబ్జర్వర్లు గమనించాలని, పోలింగ్ మొదలైన సమయాన్ని, సాయంత్రం ముగిసిన సమయాన్ని రికార్డు చేసుకోవాలన్నారు. మాక్ పోలింగ్ సమయంలో ఒక వేళ ఈవీఎంలు మోరాయించినట్లయితే సెక్టోరియల్ అధికారిని సంప్రదించాలని, అవసరమైతే ఈవీఎంను మార్చుకోవాలన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సామాగ్రి పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేసి స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచి, అక్కడి సెక్యూరిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రిటర్నింగ్, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఇంటికెళ్లాల్సి ఉంటుందని సమాచారం.

ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ అసిస్టెన్స్ కౌంటర్..

హైదరాబాద్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్ అసెంబ్లీ పరిధిలోని మొత్తం 3,986 పోలింగ్ స్టేషన్లలో తప్పనిసరిగా ఓటర్ అసిస్టెన్స్ కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటరుకు కావల్సిన సహాయాన్ని అందించే దిశగా ఈ కౌంటర్ పని చేయనున్నట్లు సమాచారం.

Similar News