నమో అంటే నరేంద్ర మోదీ కాదు..నమ్మించి మోసం చేయడం : కేటీఆర్

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ 10 నుండి 12 ఎంపీ సీట్లు గెలిస్తే

Update: 2024-05-06 15:09 GMT

దిశ, శేరిలింగంపల్లి : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 10 నుండి 12 ఎంపీ సీట్లు గెలిస్తే రాష్ట్రానికి తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్తీక్ రెడ్డి కార్పొరేటర్లతో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అలవిగాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, వాటిని నమ్మి ప్రజలు ఓట్లు వేశారని, తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం అయిందని మండిపడ్డారు. మోచేతికి బెల్లం పెట్టి, అరచేతిలో వైకుంఠం చూపించారని, ప్రజల ఆశలను ఆడియాశలు చేశారని అన్నారు. ఆడబిడ్డల పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం, లక్ష రూపాయలు ఎక్కడా.. వృద్దులకు ఇస్తానన్న రూ. 4 వేల పింఛన్ డబ్బులు ఎక్కడ ఇచ్చారు.

ఆడ బిడ్డలకు ఇస్తామన్న రూ. 2500లు ఏమయ్యాయి. అసలు ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు కేటీఆర్. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అట్లయితేనే పిచ్చి వాగుడు వాగుతున్న రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుందని అన్నారు. బడే భాయ్ మోదీ గత పదేళ్ల నుండి అబద్ధాలు చెబుతూ వస్తున్నారని జన్ ధన్ ఖాతా తెరవండి, నేను ధన్ ధన్ డబ్బులు వేస్తానని చెప్పారు. ఏ ఒక్కరికైనా అకౌంట్ లో రూ.15 లక్షల డబ్బులు పడ్డాయా అని ప్రజలను ప్రశ్నించారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తా, బులెట్ రైళ్లు తెస్తా, 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోదీ ఏ ఒక్కటైనా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. నమో అంటే నరేంద్రమోదీ కాదని, నమ్మించి మోసం చేయడమని, గత 10 ఏళ్ల కాలంలో ఇదే జరుగుతుందన్న కేటీఆర్ హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి సహాయం చేయలేదని విమర్శించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ఆధ్వర్యంలో నగరంలో ఎక్కడ లేని విధంగా ఫ్లై ఓవర్లు, ఐటీ కంపెనీలు వచ్చాయని, కానీ కేంద్రం ఒక్కటంటే ఒక్క పని చేయలేదని అన్నారు. నగరంలో వరదలు వస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు, మెట్రో రైలు విస్తరిస్తామంటే రూపాయి కేటాయించలేదని తెలిపారు.

బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి అని వాళ్లను అడిగితే వాళ్లు చెప్పేది ఒక్కటే కారణం.. రామునికి గుడి కట్టించినం మాకు ఓట్లు వేయండి అని, యాదగిరిగుట్టలో కేసీఆర్ గుడి కట్టాడు. తరతరాలు నిలిచిపోయేలా నిర్మాణం చేశాము. మేము ఎప్పుడైనా గుళ్ల మీద, దేవుళ్ళ పేరు మీద రాజకీయం చేశామా అని ప్రశ్నించారు కేటీఆర్. పదేళ్లలో బీఆర్ ఎస్ ఏం చేసింది అంటే నగరంలో 36 ఫ్లై ఓవర్లు కట్టాం, పెట్టుబడులు తెచ్చాం, కులం, మతం పేరున రాజకీయాలు చేయలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేశామని అన్నారు. రాహుల్ గాంధీకి మోడీని ఎదిరించే దమ్ము లేదని అది ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమని, కేసీఆర్, కేజ్రీవాల్, స్టాలిన్, మమతా బెనర్జీ, హేమంత్ సొరేన్ వల్లనే సాధ్యమని స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కారు గుర్తుపై ఓటు వేసి చేవెళ్ల ఎంపీగా కాసాని జ్ఞ్యానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Similar News