కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం చేస్తా : మాజీ మంత్రి

కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సవాల్ చేశారు.

Update: 2024-04-29 08:54 GMT

దిశ, హిమాయత్ నగర్ :  కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సవాల్ చేశారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ తో కలిసి మోత్కుపల్లి నరసింహులు మాట్లాడారు. 80 లక్షలు జనాభా ఉన్న మాదిగలకు ఒక్క పార్లమెంట్ స్థానం ఎందుకు ఇవ్వలేదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు.

ఆంధ్రవాళ్లు పరిపాలనలో ఇలాంటి అన్యాయం జరగలేదని తెలిపారు. మా జాతి పరిస్థితి ఏంటో చెప్పాలి.. కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబానికి మూడు సీట్లు.. ఇవ్వడం సమంజసమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నాను ఇది గమనించాలని ఆయన అన్నారు. అన్నీ మీ కులానికే టికెట్స్ ఇచ్చుకున్నారని.. మిగతా జాతులకు సీట్లు కేటాయించలేదని పేర్కొన్నారు. మా జాతులకు అన్యాయం చేశారని మా సత్తా ఏంటో చూపిస్తామని ధ్వజమెత్తారు.

మీ వైఖరితో మా జాతి ప్రమాదంలో పడిందని తెలిపారు. మా జాతిని నిర్వీర్యం చేయాలని కుట్ర జరుగుతుందని.. ఈ కుట్రను మాదిగ జాతి తిప్పి కొట్టాలని సూచించారు. పార్లమెంట్ లో మా జాతి బిల్లు వస్తే మాదిగ వాడు ఉండవద్దా? ఇది ఏ రకంగా సహించాలి.. ఏబీసీ వర్గీకరణ కాకుండా కుట్ర జరుగుతుందని ఆరోపించారు. రిజర్వేషన్స్ విషయంలో సీఎం ఫేక్ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ కుట్ర తిప్పి కొట్టాలంటే.. మన జాతి బలం ఏంటో చూపించాలన్నారు. ప్రతి నియోజకవర్గం తిరిగి సంఘటితం చేస్తానని ఆయన వెల్లడించారు.

మంద కృష్ణ మాట్లాడుతూ..ఒక సీటు కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని.. మాలలతో కుమ్మక్కు అయ్యి మాకు అన్యాయం చేసారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ కి అన్యాయం చేసిందని..బోధ్పూర్ డిక్లరేషన్ అమలు చేయడం లేదని..శ్యాం మాదిగ టికెట్ రాకుండా అడ్డుకున్నారని..దొమ్మటి సాంబయ్య, ఇందిరా, సంపత్ కుమార్ మాదిగ నేతలు కదా అని మండిపడ్డారు. ఓడిపోయినా జీవన్ రెడ్డి కి టికెట్ ఇచ్చారు.. సంపత్ కి ఇవ్వలేదు.. బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ పార్టీలో గొప్ప నాయకుడు.. అయినా టికెట్ ఇవ్వలేదన్నారు.

రేవంత్ రెడ్డి వల్లనే మాదిగలు అన్యాయం జరిగిందని స్పష్టంగా అర్థం అవుతుందని మంద కృష్ణ మాదిగ అన్నారు. రాజకీయ మూల్యం చెల్లించుకొంటారని ఆయన హెచ్చరించారు. నరసింహులు ఆధ్వర్యంలో మే 4 న ఇందిరా పార్క్, లేదా అంబేద్కర్ విగ్రహం వద్ద సామూహిక దీక్ష, ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు నరేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ ప్రతినిధులు సోమశేఖర్, శివ, తదితరులు పాల్గొన్నారు.

Similar News